మైనింగ్ కంపెనీలకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ : జీతాలు పెంచుతూ ఉద్యోగులకు తీపికబురు అందించడంతో పాటు.. ఖనిజ కంపెనీలకు కూడా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొత్త ఖనిజ అన్వేషణ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో 100 ఖనిజాల బ్లాక్ ల ఆక్షన్ కు మార్గం సుగమమైంది. కేబినెట్ ఆమోదం తెలిపిన ఈ జాతీయ ఖనిజ అన్వేషణ పాలసీ(ఎన్ఎమ్ఈపీ) ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిన 100 బ్లాక్ లలో ఖనిజాల అన్వేషణకు ప్రభుత్వం ఆక్షన్ నిర్వహించవచ్చు. ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులను సూచించడంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ప్రైవేట్ రంగాలు కూడా ఖనిజాల అన్వేషణలో పాల్గొనవచ్చు. ప్రైవేట్ పెట్టుబడులను ఖనిజాల అన్వేషణలో ఆకర్షణీయమైన నిబంధనగా చేర్చడం ఈ పాలసీ కింద అత్యంత ముఖ్యమైన ఫీచర్ అని అధికారులు చెబుతున్నారు. దేశాన్ని ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన ఫలితంగా కేంద్ర కేబినెట్ నేడు ఈ కీలక నిర్ణయం ప్రకటించింది. అంతేకాక ఈ పాలసీ ప్రకారం, ఖనిజాల గనుల్లో ఈ-ఆక్షన్ తర్వాత విజయవంతమైన బిడ్డర్ నుంచి మైనింగ్ ఆపరేషన్ లో కొంత రెవెన్యూ వాటాను ప్రైవేట్ సంస్థలు పొందే అవకాశం ఉంది. ఈ రెవెన్యూ షేరింగ్ ఏక మొత్తంగా లేదా వార్షికంగా పొందుతారు. ట్రాన్సఫరెబుల్ రైట్స్ తో ఈ చెల్లింపులు మైనింగ్ లీజు కాలమంతా వర్తించనున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లో మైనింగ్ షేర్లు దూసుకుపోతున్నాయి. ఆశాపురా, ఇండియన్ మెటల్స్, మిథైన్ అలోయ్స్ షేర్లు లాభాల బాట పట్టాయి.