Mining companies
-
మైనింగ్ కంపెనీలకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ : జీతాలు పెంచుతూ ఉద్యోగులకు తీపికబురు అందించడంతో పాటు.. ఖనిజ కంపెనీలకు కూడా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొత్త ఖనిజ అన్వేషణ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో 100 ఖనిజాల బ్లాక్ ల ఆక్షన్ కు మార్గం సుగమమైంది. కేబినెట్ ఆమోదం తెలిపిన ఈ జాతీయ ఖనిజ అన్వేషణ పాలసీ(ఎన్ఎమ్ఈపీ) ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిన 100 బ్లాక్ లలో ఖనిజాల అన్వేషణకు ప్రభుత్వం ఆక్షన్ నిర్వహించవచ్చు. ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులను సూచించడంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ప్రైవేట్ రంగాలు కూడా ఖనిజాల అన్వేషణలో పాల్గొనవచ్చు. ప్రైవేట్ పెట్టుబడులను ఖనిజాల అన్వేషణలో ఆకర్షణీయమైన నిబంధనగా చేర్చడం ఈ పాలసీ కింద అత్యంత ముఖ్యమైన ఫీచర్ అని అధికారులు చెబుతున్నారు. దేశాన్ని ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన ఫలితంగా కేంద్ర కేబినెట్ నేడు ఈ కీలక నిర్ణయం ప్రకటించింది. అంతేకాక ఈ పాలసీ ప్రకారం, ఖనిజాల గనుల్లో ఈ-ఆక్షన్ తర్వాత విజయవంతమైన బిడ్డర్ నుంచి మైనింగ్ ఆపరేషన్ లో కొంత రెవెన్యూ వాటాను ప్రైవేట్ సంస్థలు పొందే అవకాశం ఉంది. ఈ రెవెన్యూ షేరింగ్ ఏక మొత్తంగా లేదా వార్షికంగా పొందుతారు. ట్రాన్సఫరెబుల్ రైట్స్ తో ఈ చెల్లింపులు మైనింగ్ లీజు కాలమంతా వర్తించనున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లో మైనింగ్ షేర్లు దూసుకుపోతున్నాయి. ఆశాపురా, ఇండియన్ మెటల్స్, మిథైన్ అలోయ్స్ షేర్లు లాభాల బాట పట్టాయి. -
బడా సంస్థల గుప్పిట్లోకి మైనింగ్!
హైదరాబాద్: కేంద్ర గనుల శాఖ ఇటీవల అమల్లోకి తెచ్చిన గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ- (ఎంఎండీఆర్) సవరణ చట్టం - 2015 చిన్నస్థాయి గనుల యజమానులను కలవరపరుస్తోంది. మైనింగ్ రంగాన్ని (దేశ ఖనిజ సంపదను) కొన్ని బడా సంస్థలు గుప్పిట్లోకి తీసుకుని శాసించేందుకు అవకాశం కల్పించేలా ఈ ఆర్డినెన్స్ ఉందని చిన్న, మధ్యతరహా గనుల యజమానులతోపాటు మైనింగ్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంఎండీఆర్ ఆర్డినెన్స్‌పై ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మైనింగ్ భాగస్వాములతో గురు, శుక్రవారాల్లో హైదరాబాద్‌లో కేంద్ర భూ గర్భ గనుల శాఖ సదస్సు నిర్వహించింది. ఇందులో వ్యక్తమైన ఆందోళన, అభిప్రాయాల వివరాలు.. వేలం విధానంవల్ల పెద్ద సంస్థలు సిండికేట్‌గా మారి అతివిలువైన జాతీయ ఖనిజ సంపదనంతా కైవసం చేసుకునే ప్రమాదం ఉంది. ఇది చివరకు మైనింగ్ మాఫియాకు దారితీసే ప్రమాదం ఉంది. మైనింగ్ లీజులతో చిన్న గనుల్లో ఖనిజాన్ని తవ్వి చిన్న పరిశ్రమలకు సరఫరా చేయడం చేసి రాష్ట్రంలో వేలాది మంది స్వయంఉపాధి పొందుతున్నారు. గనులను వేలం వేస్తే వారు వీధినపడాల్సి వస్తుంది. 4వ షెడ్యూల్ నుంచి సున్నపురాయిని తొలగించాలి: కేంద్రానికి డోన్ ఎమ్మెల్యే లేఖ సిమెంట్ పరిశ్రమకే కాకుండా చక్కెర, గ్లాస్, సబ్బు లు (డిటర్జెంట్), పశు, కోళ్ల దాణా తదితర పరిశ్రమల్లో సున్నపురాయిని వినియోగిస్తున్నందున ఈ ఖనిజాన్ని నాలుగో షెడ్యూల్ నుంచి తొలగించాలని కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బి. రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎంఎండీఆర్ ఆర్డినెన్స్‌ను సవరిం చాలంటూ పలు సూచనలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని కేంద్రగనులశాఖ ఆర్థిక సలహాదారు సుధాకర్ శుక్లాకు పంపించారు. క్యాప్టివ్, నాన్ క్యాప్టివ్ లీజులనే తేడా లేకుండా గడువును 2030 మార్చి 31గా నిర్దేశించాలని, పట్టాభూముల్లో ఖనిజ లీజు లను వాటియజమానులకే ఇవ్వాలని సూచించారు. మైనింగ్ లీజులను బదిలీ చేసే వ్యక్తి, బదిలీ పొందే వ్యక్తి ప్రయోజనాలను కాపాడాలి. అమల్లో ఉన్న లీజుల బదిలీకి అనుమతించాలని ఆయన లేఖలో కోరారు. -
మైనింగ్‌కు సింగిల్ విండో విధానం కావాలి
ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ సంస్థలు స్థల సమీకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నాయని మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారి చెప్పారు. ప్రస్తుతం ఒక్కొక్క విభాగం నుంచి ఒక్కో అనుమతి తీసుకోవాల్సి వస్తున్నందున, ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల అనుమతులను వేగవంతం చేసే దిశగా సింగిల్ విండో విధానం అవసరమని తెలిపారు. ఇటు వృద్ధి, అటు పర్యావరణ పరిరక్షణ విధానాల మధ్య సమతౌల్యం పాటించే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ‘దేశ వృద్ధిలో మైనింగ్ కీలక పాత్ర’ అంశంపై శనివారం ఇక్కడ జరిగిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఎన్ఎండీసీ ప్రస్తుత మైనింగ్ వార్షిక సామర్థ్యం 30 మిలియన్ టన్నులు ఉండగా.. దీన్ని 50 మిలియన్ టన్నులకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు, ఉక్కు రంగంలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా దాదాపు రూ. 15,000 కోట్ల పైచిలుకు ఇన్వెస్ట్‌మెంట్‌తో తలపెట్టిన స్టీల్ ప్లాంటు పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. ఇక గనుల అప్‌గ్రెడేషన్ కోసం రూ.10,000 కోట్ల దాకా వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. విస్తరణపై దృష్టి: నైవేలీ లిగ్నైట్ సీఎండీ సురేంద్ర 12వ ప్రణాళిక కాలంలో (2012-2017) విస్తరణపై రూ. 29,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని సెమినార్లో నైవేలీ లిగ్నైట్ సీఎండీ సురేంద్ర మోహన్ తెలిపారు. ఇందులో 30 శాతం సొంత నిధులు కాగా, మిగతాది రుణం రూపంలో సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. ట్యుటికోరిన్‌లో తలపెట్టిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్లాంటు త్వరలో అందుబాటులోకి రాగలదని వివరించారు. బొగ్గు బ్లాకుల కొనుగోలు కోసం మొజాంబిక్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కొన్నింటిని షార్ట్‌లిస్ట్ చేశామని, 2014-15 ఆఖరుకల్లా డీల్ పూర్తి కాగలదన్నారు. లిగ్నైట్‌లో తేమ శాతాన్ని తగ్గించి, నాణ్యతను పెంచే దిశగా అప్‌గ్రెడేషన్ కోసం జపాన్‌కి చెందిన కోబే స్టీల్‌తో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని తెలిపారు. -
సీఎం గారూ..ఆధారాలివిగో
= ఇప్పటికైనా కేబినెట్ నుంచి సంతోష్‌లాడ్‌ను తొలగించండి = ఆయన భాగస్వామిగా ఉన్న వీఎస్లాడ్ మైనింగ్ సంస్థపై కేసులు = ఖనిజాన్ని అక్రమంగా తవ్వుకున్నారు = సీజ్ చేసిన ఖనిజాన్నీ రవాణా చేశారు = 68 ఎకరాల అటవీ భూమినీ కబ్జా చేశారు = ఎఫ్ఓసీలను విడుదల చేసిన హీరేమఠ్ సాక్షి, బెంగళూరు : రాష్ట్ర సమాచార శాఖ మంత్రి సంతోష్‌లాడ్‌కు అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో భాగం ఉందని, అందువల్ల ఆయన్ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్(ఎన్సీపీఎన్ఆర్) సంస్థ అధ్యక్షుడు హీరేమఠ్ డిమాండ్ చేశారు. ఆ మంత్రి అక్రమలకు పాల్పడ్డారనే ఆధారాలేవీ లేనందున చర్యలు తీసుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందుకే పూర్తి ఆధారాలు సేకరించానని ఆయన వివరించారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీఎస్లాడ్ సంస్థపై అటవీశాఖలో నమోదైన కేసులు, అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు, సీఈసీ సుప్రీం కోర్టుకు అందజేసిన నివేదిక తదితర పత్రాలను ఆయన మీడియా ప్రతినిధులకు అందజేశారు. అనంతరం హీరేమఠ్ మాట్లాడుతూ... సంతోష్‌లాడ్ భాగస్వామిగా ఉన్న వీఎస్ లాడ్ అండ్ సన్స్ మైనింగ్ సంస్థ ప్రభుత్వం కేటాయించిన దాని కంటే 80 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వడమే కాక దాదాపు 68 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించుకుందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి అటవీశాఖలో 2009 ఫిబ్రవరిలో ఒక కేసు, 2010 ఆగస్టులో మరో కేసు నమోదైందని తెలిపారు. 2009లో అటవీశాఖ సీజ్ చేసిన 81 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని కూడా వీఎస్ లాడ్ సంస్థ తిరిగి అక్రమంగా రవాణా చేసిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తాను సేకరించానని చెప్పారు. అంతేకాక ఫిబ్రవరి 2012లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) సుప్రీం కోర్టుకు అందించిన నివేదికలోనూ వీఎస్ లాడ్ అండ్ సన్స్ సంస్థ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిందని అందుకే సీ-కేటగిరిలో చేర్చాలని సుప్రీం కోర్టును కోరిందని అన్నారు. ఇలా అనేక విధాలుగా అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వీఎస్ లాడ్ అండ్ సన్స్ సంస్థలో భాగస్వామి అయిన మంత్రి సంతోష్‌లాడ్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను డిమాండ్ చేశారు.