బడా సంస్థల గుప్పిట్లోకి మైనింగ్!
హైదరాబాద్: కేంద్ర గనుల శాఖ ఇటీవల అమల్లోకి తెచ్చిన గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ- (ఎంఎండీఆర్) సవరణ చట్టం - 2015 చిన్నస్థాయి గనుల యజమానులను కలవరపరుస్తోంది. మైనింగ్ రంగాన్ని (దేశ ఖనిజ సంపదను) కొన్ని బడా సంస్థలు గుప్పిట్లోకి తీసుకుని శాసించేందుకు అవకాశం కల్పించేలా ఈ ఆర్డినెన్స్ ఉందని చిన్న, మధ్యతరహా గనుల యజమానులతోపాటు మైనింగ్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంఎండీఆర్ ఆర్డినెన్స్‌పై ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మైనింగ్ భాగస్వాములతో గురు, శుక్రవారాల్లో హైదరాబాద్‌లో కేంద్ర భూ గర్భ గనుల శాఖ సదస్సు నిర్వహించింది. ఇందులో వ్యక్తమైన ఆందోళన, అభిప్రాయాల వివరాలు..
వేలం విధానంవల్ల పెద్ద సంస్థలు సిండికేట్‌గా మారి అతివిలువైన జాతీయ ఖనిజ సంపదనంతా కైవసం చేసుకునే ప్రమాదం ఉంది. ఇది చివరకు మైనింగ్ మాఫియాకు దారితీసే ప్రమాదం ఉంది. మైనింగ్ లీజులతో చిన్న గనుల్లో ఖనిజాన్ని తవ్వి చిన్న పరిశ్రమలకు సరఫరా చేయడం చేసి రాష్ట్రంలో వేలాది మంది స్వయంఉపాధి పొందుతున్నారు. గనులను వేలం వేస్తే వారు వీధినపడాల్సి వస్తుంది.
4వ షెడ్యూల్ నుంచి సున్నపురాయిని తొలగించాలి: కేంద్రానికి డోన్ ఎమ్మెల్యే లేఖ
సిమెంట్ పరిశ్రమకే కాకుండా చక్కెర, గ్లాస్, సబ్బు లు (డిటర్జెంట్), పశు, కోళ్ల దాణా తదితర పరిశ్రమల్లో సున్నపురాయిని వినియోగిస్తున్నందున ఈ ఖనిజాన్ని నాలుగో షెడ్యూల్ నుంచి తొలగించాలని కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బి. రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఎంఎండీఆర్ ఆర్డినెన్స్‌ను సవరిం చాలంటూ పలు సూచనలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని కేంద్రగనులశాఖ ఆర్థిక సలహాదారు సుధాకర్ శుక్లాకు పంపించారు. క్యాప్టివ్, నాన్ క్యాప్టివ్ లీజులనే తేడా లేకుండా గడువును 2030 మార్చి 31గా నిర్దేశించాలని, పట్టాభూముల్లో ఖనిజ లీజు లను వాటియజమానులకే ఇవ్వాలని సూచించారు. మైనింగ్ లీజులను బదిలీ చేసే వ్యక్తి, బదిలీ పొందే వ్యక్తి ప్రయోజనాలను కాపాడాలి. అమల్లో ఉన్న లీజుల బదిలీకి అనుమతించాలని ఆయన లేఖలో కోరారు.