National Committee for Protection of Natural Resources
-
రూ. లక్షల కోట్ల భూ కబ్జా
డీకే ‘రియల్’ మోసం 173 ఎకరాలు అన్యాక్రాంతం కేబినెట్ నుంచి ఆయన్ను తొలగించాల్సిందే సీఎంను డిమాండ్ చేసిన హీరేమఠ్ సాక్షి, బెంగళూరు : ఎస్ఎం కృష్ణ కేబినెట్లో సహకార శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన డీకే శివకుమార్ ఆ సమయంలో వయ్యాలికావల్‌లోని 173 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ (ఎన్సీపీఎన్ఆర్) వ్యవస్థాపకులు హీరేమఠ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ సహకార సంఘానికి కేటాయించిన భూమిని నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ధారాదత్తం చేయడంతో పాటు అందులోని కొన్ని ఫ్లాట్లను తన వారికే కేటాయించుకున్నారని విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో హీరేమఠ్ ఇలా మాట్లాడారు... ‘అప్పట్లో గృహ నిర్మాణ సంఘానికి నగరంలోని వయ్యాలికావల్ లో 173 ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అనంతరం 2002 ఏప్రిల్ ఒకటో తేదీన సహకార సంఘాల బైలాలో అప్పటి మంత్రి డీకే మార్పులు చేయించారు. దీంతో అనేక మంది ఉద్యోగులు ఆ భూమిని పొందే హక్కును కోల్పోయారు. అనంతరం ఆ భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన వ్యక్తితో పాటు అతని కుటుంబ సభ్యులకు డీకే కేటాయించారు. అలా అక్రమంగా కేటాయించిన ఆ భూమి విలువ ప్రస్తుతం దాదాపు రూ. లక్షల కోట్లు ఉంటుంది. ఈ కుంభకోణంలో డీకే కీలక పాత్ర పోషించారు. యూపీఏ హయాంలో జరిగిన 2జీ కుంభకోణం కంటే ఇది చాలా పెద్దది. ఇంత గా అవినీతికి పాల్పడిన డీకేను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలి. ఆయనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలి. అప్పుడే నిజానిజాలు ప్రజలకు అర్థమవుతాయి’. అని అన్నారు. అనంతరం ఆయన ఈ అక్రమాలకు సంబంధించిన కొన్ని ఆధారాలను విడుదల చేశారు -
రూ.20 వేల కోట్ల విలువైన భూమి హాంఫట్
సాక్షి, బెంగళూరు :బెంగళూరు అర్బన్ జిల్లాలోని ప్రముఖ ప్రాంతాల్లో రూ.20 వేల కోట్ల విలువ చేసే భూములను రాజకీయ నాయకులతో పాటు కొన్ని ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థలు అక్రమంగా సొంతం చేసుకున్నాయని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ (ఎన్సీపీఎన్ఆర్) వ్యవ స్థాపకుడు ఎస్.ఆర్.హీరేమఠ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖను మంగళవారమిక్కడ మీడియాకు విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏదైనా మున్సిపాలిటీ లేదా మెట్రోపాలిటన్ కార్పొరేషన్ పరిధిలోని 18 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోను రెగ్యులరైజ్ చేయరాదని కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1964 చెబుతోందని తెలిపారు. అయితే ఈ యాక్ట్‌కు వ్యతిరేకంగా మాజీ మేయర్ డి.వెంకటేష్ మూర్తి, ఆయన భార్య ప్రభ నగరంలోని పద్మనాభ నగరలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో చెరో నాలుగు ఎకరాల భూమిని పొందారని ఆరోపించారు. ఇందుకు అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆర్.అశోక్ సహాయం చేశారని పేర్కొన్నారు. మాజీ కేంద్రమంత్రి ఎస్.ఎం.కృష్ణ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (2004లో) ఆయన సోదరుని కుమార్తెకు యశ్వంతపురలో ఐదెకరాల ముప్పై కుంటల స్థలాన్ని డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో కేటాయించారని తెలిపారు. అయితే ఆ స్థలంలో ఇప్పటికీ ఎలాంటి విద్యాసంస్థను స్థాపించకుండా ఇతర వ్యవహారాల కోసం భూమిని వినియోగిస్తున్నారని చెప్పారు. తన అల్లుడైన వి.జి.సిద్ధార్థ్‌కు కూడా అక్రమంగా భూ కేటాయింపులు చేశారని ఆరోపించారు. నగరంలోని కొన్ని ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థలు కూడా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కొన్ని వందల ఎకరాల భూమిని పొందాయని పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు రూ.20 వేల కోట్లు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదికలో వెల్లడైందని చెప్పారు. ఈ నివేదిక ప్రభుత్వానికి అంది చాలా కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ సంబంధిత నాయకులు, అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమన్నారు. బహుశా టాస్క్‌ఫోర్స్ నివేదికలో పేర్కొన్న నేతలపై చర్యలు కనుక ప్రారంభిస్తే విధానసౌధలో కూర్చున్న రాజకీయ నాయకుల్లో దాదాపు 20 శాతం మంది జైలు కెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలకు వెనకాడుతోందని విమర్శించారు. వేల కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని హీరేమఠ్.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమంగా కేటాయించిన భూవ ుులన్నింటిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని, అక్రమంగా భూములు పొందిన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను
= ఎన్సీపీఎన్ఆర్ వ్యవస్థాపకుడు హీరేమఠ్ = స్వచ్ఛమైన రాజకీయాల కోసం పోరాడే కార్యకర్తగానే ఉంటా = అవినీతిపై పోరాటం చేస్తూనే ఉంటా = ఆప్ తరహా పార్టీలకు కేవలం సలహాలు, సూచనలు ఇస్తా = ఎమ్మెల్యే రమేష్ కుమార్ అక్రమాలకు ఆధారాలున్నాయి సాక్షి, బెంగళూరు : తాను స్వచ్ఛమైన రాజకీయాల కోసం పోరాడే కార్యకర్తగా ఉంటానే తప్ప.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ (ఎన్సీపీఎన్ఆర్) వ్యవస్థాపకుడు ఎస్.ఆర్. హీరేమఠ్ వెల్లడించారు. తాను కేవలం రాజకీయల్లో పారదర్శకత కోసం శ్రమించే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), లోక్‌సత్తా తదితర పార్టీలకు తన సలహాలు, సూచనలు అందిస్తానే తప్ప.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ఏర్పాటు చేసి ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తరహాలో మీరు కూడా పార్టీ పెట్టే ఆలోచన ఏదైనా ఉందా?.. అన్న విలేకరుల ప్రశ్నకు ఆయనపై విధంగా సమాధానమిచ్చారు. తానెన్నడూ అధికారాన్ని కోరుకోలేదని, అవినీతిపై పోరాటానికి మాత్రమే తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాజకీయాల్లో మార్పును తీసుకువచ్చేందుకు ఆప్ తరహా పార్టీల ఆవశ్యకత ఎంతైనా ఉందని హీరేమఠ్ అభిప్రాయపడ్డారు. ఇక ఇదే సమావేశంలో పాల్గొన్న జన్సంగ్రామ్ పరిషత్ అధ్యక్షుడు రాఘవేంద్ర కుష్టగి మాట్లాడుతూ... ఆప్ ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. అపుడే ప్రజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. రమేష్ కుమార్ అక్రమాలు బయట పెట్టాలి.. శ్రీనివాసపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ భూములకు సంబంధించిన పత్రాలను తక్షణమే బయటపెట్టాలని హీరేమఠ్ డిమాండ్ చేశారు. కోలారు జిల్లాలోని శ్రీనివాసపురలో 60 ఎకరాల అటవీ భూములను రమేష్‌కుమార్ కబ్జా చేశారని ఆరోపించారు. అయితే ఆ భూములను ఆక్రమించుకోలేదని.. 45 ఎకరాల భూమిని వేరే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేశానని రమేష్ కుమార్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రమేష్ కుమార్ భూ ఆక్రమణలకు పాల్పడ్డారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని హీరేమఠ్ తెలిపారు. ఇక రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగుతున్న భూ ఆక్రమణలను అడ్డుకునే దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇక నగరంలోని వివిధ సరస్సుల కబ్జాకు పాల్పడిన మాజీ మంత్రి ఆర్.అశోక్, మాజీ మేయర్ డి.వెంకటేష్ మూర్తిలపై కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరిపేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
సీఎం గారూ..ఆధారాలివిగో
= ఇప్పటికైనా కేబినెట్ నుంచి సంతోష్‌లాడ్‌ను తొలగించండి = ఆయన భాగస్వామిగా ఉన్న వీఎస్లాడ్ మైనింగ్ సంస్థపై కేసులు = ఖనిజాన్ని అక్రమంగా తవ్వుకున్నారు = సీజ్ చేసిన ఖనిజాన్నీ రవాణా చేశారు = 68 ఎకరాల అటవీ భూమినీ కబ్జా చేశారు = ఎఫ్ఓసీలను విడుదల చేసిన హీరేమఠ్ సాక్షి, బెంగళూరు : రాష్ట్ర సమాచార శాఖ మంత్రి సంతోష్‌లాడ్‌కు అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో భాగం ఉందని, అందువల్ల ఆయన్ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్(ఎన్సీపీఎన్ఆర్) సంస్థ అధ్యక్షుడు హీరేమఠ్ డిమాండ్ చేశారు. ఆ మంత్రి అక్రమలకు పాల్పడ్డారనే ఆధారాలేవీ లేనందున చర్యలు తీసుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందుకే పూర్తి ఆధారాలు సేకరించానని ఆయన వివరించారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీఎస్లాడ్ సంస్థపై అటవీశాఖలో నమోదైన కేసులు, అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు, సీఈసీ సుప్రీం కోర్టుకు అందజేసిన నివేదిక తదితర పత్రాలను ఆయన మీడియా ప్రతినిధులకు అందజేశారు. అనంతరం హీరేమఠ్ మాట్లాడుతూ... సంతోష్‌లాడ్ భాగస్వామిగా ఉన్న వీఎస్ లాడ్ అండ్ సన్స్ మైనింగ్ సంస్థ ప్రభుత్వం కేటాయించిన దాని కంటే 80 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వడమే కాక దాదాపు 68 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించుకుందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి అటవీశాఖలో 2009 ఫిబ్రవరిలో ఒక కేసు, 2010 ఆగస్టులో మరో కేసు నమోదైందని తెలిపారు. 2009లో అటవీశాఖ సీజ్ చేసిన 81 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని కూడా వీఎస్ లాడ్ సంస్థ తిరిగి అక్రమంగా రవాణా చేసిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తాను సేకరించానని చెప్పారు. అంతేకాక ఫిబ్రవరి 2012లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) సుప్రీం కోర్టుకు అందించిన నివేదికలోనూ వీఎస్ లాడ్ అండ్ సన్స్ సంస్థ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిందని అందుకే సీ-కేటగిరిలో చేర్చాలని సుప్రీం కోర్టును కోరిందని అన్నారు. ఇలా అనేక విధాలుగా అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వీఎస్ లాడ్ అండ్ సన్స్ సంస్థలో భాగస్వామి అయిన మంత్రి సంతోష్‌లాడ్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను డిమాండ్ చేశారు.