ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను
= ఎన్‌సీపీఎన్‌ఆర్ వ్యవస్థాపకుడు హీరేమఠ్
= స్వచ్ఛమైన రాజకీయాల కోసం పోరాడే కార్యకర్తగానే ఉంటా
= అవినీతిపై పోరాటం చేస్తూనే ఉంటా
= ఆప్ తరహా పార్టీలకు కేవలం సలహాలు, సూచనలు ఇస్తా
= ఎమ్మెల్యే రమేష్ కుమార్ అక్రమాలకు ఆధారాలున్నాయి
సాక్షి, బెంగళూరు : తాను స్వచ్ఛమైన రాజకీయాల కోసం పోరాడే కార్యకర్తగా ఉంటానే తప్ప.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ (ఎన్‌సీపీఎన్‌ఆర్) వ్యవస్థాపకుడు ఎస్.ఆర్. హీరేమఠ్ వెల్లడించారు. తాను కేవలం రాజకీయల్లో పారదర్శకత కోసం శ్రమించే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), లోక్‌సత్తా తదితర పార్టీలకు తన సలహాలు, సూచనలు అందిస్తానే తప్ప.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ఏర్పాటు చేసి ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తరహాలో మీరు కూడా పార్టీ పెట్టే ఆలోచన ఏదైనా ఉందా?.. అన్న విలేకరుల ప్రశ్నకు ఆయనపై విధంగా సమాధానమిచ్చారు. తానెన్నడూ అధికారాన్ని కోరుకోలేదని, అవినీతిపై పోరాటానికి మాత్రమే తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.
రాజకీయాల్లో మార్పును తీసుకువచ్చేందుకు ఆప్ తరహా పార్టీల ఆవశ్యకత ఎంతైనా ఉందని హీరేమఠ్ అభిప్రాయపడ్డారు. ఇక ఇదే సమావేశంలో పాల్గొన్న జన్‌సంగ్రామ్ పరిషత్ అధ్యక్షుడు రాఘవేంద్ర కుష్టగి మాట్లాడుతూ... ఆప్ ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. అపుడే ప్రజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
రమేష్ కుమార్ అక్రమాలు బయట పెట్టాలి..
శ్రీనివాసపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ భూములకు సంబంధించిన పత్రాలను తక్షణమే బయటపెట్టాలని హీరేమఠ్ డిమాండ్ చేశారు. కోలారు జిల్లాలోని శ్రీనివాసపురలో 60 ఎకరాల అటవీ భూములను రమేష్‌కుమార్ కబ్జా చేశారని ఆరోపించారు. అయితే ఆ భూములను ఆక్రమించుకోలేదని.. 45 ఎకరాల భూమిని వేరే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేశానని రమేష్ కుమార్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రమేష్ కుమార్ భూ ఆక్రమణలకు పాల్పడ్డారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని హీరేమఠ్ తెలిపారు. ఇక రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగుతున్న భూ ఆక్రమణలను అడ్డుకునే దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇక నగరంలోని వివిధ సరస్సుల కబ్జాకు పాల్పడిన మాజీ మంత్రి ఆర్.అశోక్, మాజీ మేయర్ డి.వెంకటేష్ మూర్తిలపై కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరిపేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.