రూ.20 వేల కోట్ల విలువైన భూమి హాంఫట్ | Hamphat land worth Rs 20 crore | Sakshi
Sakshi News home page

రూ.20 వేల కోట్ల విలువైన భూమి హాంఫట్

Published Wed, Dec 25 2013 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

Hamphat land worth Rs 20 crore

సాక్షి, బెంగళూరు :బెంగళూరు అర్బన్ జిల్లాలోని ప్రముఖ ప్రాంతాల్లో రూ.20 వేల కోట్ల విలువ చేసే భూములను రాజకీయ నాయకులతో పాటు కొన్ని ప్రముఖ కన్‌స్ట్రక్షన్ సంస్థలు అక్రమంగా సొంతం చేసుకున్నాయని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ (ఎన్‌సీపీఎన్‌ఆర్) వ్యవ స్థాపకుడు ఎస్.ఆర్.హీరేమఠ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖను మంగళవారమిక్కడ మీడియాకు విడుదల చేశారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏదైనా మున్సిపాలిటీ లేదా మెట్రోపాలిటన్ కార్పొరేషన్ పరిధిలోని 18 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోను రెగ్యులరైజ్ చేయరాదని కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1964 చెబుతోందని తెలిపారు. అయితే ఈ యాక్ట్‌కు వ్యతిరేకంగా మాజీ మేయర్ డి.వెంకటేష్ మూర్తి, ఆయన భార్య ప్రభ నగరంలోని పద్మనాభ నగరలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో చెరో నాలుగు ఎకరాల భూమిని పొందారని ఆరోపించారు. ఇందుకు అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆర్.అశోక్ సహాయం చేశారని పేర్కొన్నారు.

మాజీ కేంద్రమంత్రి ఎస్.ఎం.కృష్ణ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (2004లో) ఆయన సోదరుని కుమార్తెకు యశ్వంతపురలో ఐదెకరాల ముప్పై కుంటల స్థలాన్ని డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో కేటాయించారని తెలిపారు. అయితే ఆ స్థలంలో ఇప్పటికీ ఎలాంటి విద్యాసంస్థను స్థాపించకుండా ఇతర  వ్యవహారాల కోసం భూమిని వినియోగిస్తున్నారని చెప్పారు. తన అల్లుడైన వి.జి.సిద్ధార్థ్‌కు కూడా అక్రమంగా భూ కేటాయింపులు చేశారని ఆరోపించారు.

నగరంలోని కొన్ని ప్రముఖ కన్‌స్ట్రక్షన్ సంస్థలు కూడా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కొన్ని వందల ఎకరాల భూమిని పొందాయని పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు రూ.20 వేల కోట్లు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదికలో వెల్లడైందని చెప్పారు. ఈ నివేదిక ప్రభుత్వానికి అంది చాలా కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ సంబంధిత నాయకులు, అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమన్నారు.

బహుశా టాస్క్‌ఫోర్స్ నివేదికలో పేర్కొన్న నేతలపై చర్యలు కనుక ప్రారంభిస్తే విధానసౌధలో కూర్చున్న రాజకీయ నాయకుల్లో దాదాపు 20 శాతం మంది జైలు కెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలకు వెనకాడుతోందని విమర్శించారు. వేల కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని హీరేమఠ్.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమంగా కేటాయించిన భూవ ుులన్నింటిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని, అక్రమంగా భూములు పొందిన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement