ఎస్‌ఎం కృష్ణ కేబినెట్‌లో సహకార శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన డీకే శివకుమార్ ఆ సమయంలో వయ్యాలికావల్‌లోని 173 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ (ఎన్‌సీపీఎన్‌ఆర్) వ్యవస్థాపకులు హీరేమఠ్ ఆరోపించారు.
డీకే ‘రియల్’ మోసం
173 ఎకరాలు అన్యాక్రాంతం
కేబినెట్ నుంచి ఆయన్ను తొలగించాల్సిందే
సీఎంను డిమాండ్ చేసిన హీరేమఠ్
సాక్షి, బెంగళూరు : ఎస్‌ఎం కృష్ణ కేబినెట్‌లో సహకార శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన డీకే శివకుమార్ ఆ సమయంలో వయ్యాలికావల్‌లోని 173 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ (ఎన్‌సీపీఎన్‌ఆర్) వ్యవస్థాపకులు హీరేమఠ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ సహకార సంఘానికి కేటాయించిన భూమిని నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ధారాదత్తం చేయడంతో పాటు అందులోని కొన్ని ఫ్లాట్లను తన వారికే కేటాయించుకున్నారని విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో హీరేమఠ్ ఇలా మాట్లాడారు... ‘అప్పట్లో గృహ నిర్మాణ సంఘానికి నగరంలోని వయ్యాలికావల్ లో 173 ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
అనంతరం 2002 ఏప్రిల్ ఒకటో తేదీన సహకార సంఘాల బైలాలో అప్పటి మంత్రి డీకే మార్పులు చేయించారు. దీంతో అనేక మంది ఉద్యోగులు ఆ భూమిని పొందే హక్కును కోల్పోయారు. అనంతరం ఆ భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన వ్యక్తితో పాటు అతని కుటుంబ సభ్యులకు డీకే కేటాయించారు. అలా అక్రమంగా కేటాయించిన ఆ భూమి విలువ ప్రస్తుతం దాదాపు రూ. లక్షల కోట్లు ఉంటుంది. ఈ కుంభకోణంలో డీకే కీలక పాత్ర పోషించారు. యూపీఏ హయాంలో జరిగిన 2జీ కుంభకోణం కంటే ఇది చాలా పెద్దది. ఇంత గా అవినీతికి పాల్పడిన డీకేను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలి. ఆయనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలి. అప్పుడే నిజానిజాలు ప్రజలకు అర్థమవుతాయి’. అని అన్నారు. అనంతరం ఆయన ఈ అక్రమాలకు సంబంధించిన కొన్ని ఆధారాలను విడుదల చేశారు