= అక్రమ మైనింగ్ ఎఫెక్ట్..
= ప్రైవేట్ కారులో సీఎం నివాసానికి
= 20 నిమిషాల పాటు చర్చలు
= రాజీనామా అనివార్యతను వివరించిన సీఎం
= విపక్షాలకు అవకాశం ఇవ్వరాదని ఇతర మంత్రుల ఒత్తిళ్లు
= పదవిని కాపాడుకోడానికి లాడ్ తుదివరకూ యత్నం
= సిద్ధు నిర్ణయమే ఫైనలని తేల్చిచెప్పిన అధిష్టానం
= రాజీనామా చేయబోనని సాయంత్రం ప్రకటన
= పార్టీకి ఇబ్బంది కలగరాదని రాత్రికి రాజీనామా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర సమాచార, ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్ శుక్రవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆయన నివాసంలో కలుసుకుని రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘నా ఇష్ట ప్రకారమే రాజీనామా చేశాను. పార్టీకి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఇందులో ఎవరి ప్రమేయం లేదు’ ఆని అన్నారు. కాగా అక్రమ మైనింగ్‌లో ఆయన భాగస్వామిగా ఉన్న సంస్థకు ప్రమేయం ఉందంటూ సామాజికవేత్తలు హీరేమఠ్. అబ్రహాంలు పదే పదే ఆరోపణలు చేయడమే కాకుండా పలు సాక్ష్యాధారాలను విడతల వారీగా విడుదల చేశారు. వాటినన్నిటినీ గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్‌కు కూడా అందజేశారు. వీటిని గవర్నర్ ముఖ్యమంత్రికి పంపించడంతో లాడ్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
శుక్రవారం సాయంత్రం లాడ్ ప్రైవేట్ కారులో సీఎం సిద్ధరామయ్య నివాసానికి వెనుక ద్వారం నుంచి వచ్చారు. 20 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. రాజీనామా చేయాల్సిన అనివార్యతను ముఖ్యమంత్రి ఆయనకు వివరించడంతో మానసికంగా సిద్ధమై వెనుదిరిగారు. సంతోష్ లాడ్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు అదే పనిగా ఆరోపణలు సంధిస్తుండడంతో ఆయన చేత రాజీనామా చేయంచాలని మంత్రి వర్గ సహచరులు సైతం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారు.
బెల్గాంలో సోమవారం నుంచి శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నందున, ప్రతిపక్షాల చేతికి ఆయుధం అందించరాదని కోరారు. దీంతో ఆయన గురువారం రాత్రే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని లాడ్‌కు సూచనలు పంపారు. అధిష్టానంలోని తన గాడ్ ఫాదర్ల ద్వారా పదవిని కాపాడుకోవడానికి లాడ్ తుదికంటా ప్రయత్నించారు. అయితే ఈ విషయంలో అంతిమ అధికారం ముఖ్యమంత్రిదేనని అధిష్టానం తేల్చి చెప్పడంతో లాడ్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేశారు. లాడ్ అక్రమాలకు పాల్పడ లేదంటూ ముఖ్యమంత్రి పదే పదే వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు. లాడ్ రాజీనామా చేయకపోతే శీతాకాల సమావేశాలను సజావుగా సాగనివ్వబోమని బీజేపీ హెచ్చరించింది.
రాజీనామా చేసేది లేదు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజీనామా లేఖను సమర్పించడానికి కొన్ని నిమిషాల ముందు లాడ్ విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను తప్పు చేయలేదని, కనుక రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనను రాజీనామా చేయాలని ఎవరూ సూచించ లేదని తెలిపారు. మరో సారి ముఖ్యమంత్రిని కలుసుకుని చర్చిస్తానని ఆయన వెల్లడించారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్‌ను కలుసుకున్న అనంతరం లాడ్ ఈ విధంగా మాట్లాడడం చర్చనీయాంశమైనా, లాడ్ రాజీనామా లేఖను సమర్పించడం ద్వారా డ్రామాకు తెర దించారు.
లాడ్ రాజీనామా
Published Sat, Nov 23 2013 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement
Advertisement