ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారు. ఐదేళ్లు పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. అయితే.. మనోజ్ సోనీ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సమాచారం. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు.
2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరిన మనోజ్ సోనీ.. మే 16, 2023న చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మనోజ్ సోనీ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. 2005లో వడోదరలోని ప్రసిద్ధ ఎంఎస్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్‌గా ఆయన పనిచేశారు.
ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో మనోజ్ సోనీ రాజీనామా సంచలనం రేపుతోంది. అయితే గత కొన్ని రోజుల ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు సమాచారం. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ పరీక్షతోనే ఐఏఎస్‌కు ఎంపికైన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఇటీవల అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. 2022 సివిల్ సర్వీసెస్ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా పంపించింది.
కాగా, మనోజ్ సోని రాజీనామా చేయడం వెనుక.. మనోజ్ సోని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment