అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాచార శాఖ మంత్రి సంతోష్‌లాడ్‌ను మంత్రిమండలి నుంచి తొలగించడమా లేదా కొన సాగించడమా...
సాక్షి, బెంగళూరు : అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాచార శాఖ మంత్రి సంతోష్‌లాడ్‌ను మంత్రిమండలి నుంచి తొలగించడమా లేదా కొన సాగించడమా అన్న విషయం ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ స్పష్టం చేశారు. బెంగళూరు శివారులోని జక్కూరు వైమానిక స్థావరంలో సోమవారం జరిగిన ఎన్‌సీసీ జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సంతోష్‌లాడ్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడుతున్నానన్నారు.
అంతేకాకుండా ఇందుకు సంబంధించి తనకు అందిన ఆధారాలన్నీ సీఎంకు అందజేసానన్నారు. ఈ విషయంలో తన పరిధి మేరకు నడుచుకుంటున్నానన్నారు. ఇక సంతోష్‌లాడ్‌ను మంత్రి స్థానంలో కొనసాగించడమా లేదా అన్నది సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమగనుల తవ్వకాలతో పాటు అవినీతి అక్రమాలు తగ్గాయని భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా గనుల తవ్వకాలకు పాల్పడిన వారి విషయమై ఒత్తిళ్లకు లొంగకుండా సీబీఐ చేస్తున్న దర్యాప్తు శ్లాఘనీయమన్నారు.
2014 వరకూ తాను గవర్నర్‌గా కర్ణాటకలోనే కొనసాగుతానని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు భరద్వాజ్ సమాధానమిచ్చారు. అంతకు మందు జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... యువత రాజకీయాల్లోకి రావడం కంటే త్రివిధ దళాల్లోకి చేరడం ఉత్తమమన్నారు. అమెరికా, యూరప్‌కు దీటుగా సైనిక సంపత్తిను పెంచుకోవాలంటే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పాటు ఉత్తమ మానవ వనరులు కూడా అవసరమన్నారు. అందువల్ల యువత పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరడానికి ముందుకు రావాలన్నారు.