ఎన్నాళ్లిలా?
- వరుస అత్యాచార ఘటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం
- సమీక్షలో పోలీస్ అధికారుల నిలదీత
- మాటలతో కాదని చేతల్లో చూపాలని హితవు
- అదుపు చేయకపోతే ప్రత్నామ్నాయం తప్పదని హెచ్చరిక
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనల నియంత్రణలో పోలీసుల వైఫల్యంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చినా, పోలీసు శాఖ ఏమీ జరగనట్లు వ్యవహరిస్తోందని నిష్టూరమాడారు.
విధాన సౌధలో సోమవారం ఆయన సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. వివిధ శాఖల మంత్రులు కూడా పాల్గొన్నారు. లైంగిక దాడులను నిరోధించడానికి, సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాల్లో సరైన చర్యలు చేపట్టడానికి రెండు రోజుల్లో సవరణ మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ఆరోగ్య, విద్య, పోలీసు శాఖలకు సీఎం సూచించారు.
రోజూ లైంగిక దాడుల వార్తలు వస్తూనే ఉన్నాయని చెబుతూ, పోలీసు శాఖ ఏం చేస్తోందని నిలదీశారు. అన్నిటికీ సర్కారు వైపు వేలెత్తి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ సక్రమంగా పని చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని డీజీపీ లాల్‌రుఖుం పచావ్‌ను నిలదీశారు. ఆయన వివరణ ఇవ్వబోగా, కోపోద్రిక్తుడైన సీఎం..తొలుత వీటిని అరికట్టండని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలతో లాభం లేదని, చేష్టలు ముఖ్యమని దెప్పి పొడిచారు.
లైంగిక దాడులకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్నాయని, ప్రతిపక్షాలు సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని చెప్పారు. అయినప్పటికీ పోలీసు శాఖ ఏమీ జరగలేదనే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పరిస్థితిని అదుపు చేయకపోతే ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని పోలీసు అధికారులను హెచ్చరించారు.
ఇకమీదట ఇలాంటి సంఘనటలు జరుగకుండా చూడాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, మహిళా సిబ్బంది సంఖ్యను పెంచాలని సూచించారు. లైంగిక దాడులు జరిగిన తర్వాత ఆరోగ్య శాఖ విమర్శలకు గురి కాకుండా సరైన పరీక్షా పద్ధతులను అనుసరించాలని ఆదేశించారు. ప్రస్తుతం దీనిపై ఉన్న మార్గదర్శకాలను సవరించి, ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన సూచించారు.