దసరా తర్వాతే | After Dussehra | Sakshi
Sakshi News home page

దసరా తర్వాతే

Published Thu, Sep 4 2014 2:50 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

దసరా తర్వాతే - Sakshi

దసరా తర్వాతే

  •  విస్తరణపై అధిష్టానాన్ని ఒప్పించిన సీఎం సిద్ధరామయ్య
  •  కలిసి వచ్చిన డిగ్గీ రాజ అమెరికా పర్యటన
  •  ఆయన వచ్చిన తర్వాతేతుది నిర్ణయమన్న హైకమాండ్
  •  పరమేశ్వరకు లైన్ క్లియర్
  •  ఉప ముఖ్యమంత్రి పదవికే కేపీసీసీ చీఫ్ పట్టు
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణను వీలైనంత మేరకు వాయిదా వేయాలని భావిస్తున్న  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ దిశగా అధిష్టానాన్ని కూడా ఒప్పించగలిగారు. బుధవారం ఢిల్లీలో ఆయన పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలను చేపట్టాలనుకుంటున్నందున, దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. అంతకు ముందు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో  సీఎం సమావేశమయ్యారు.

    రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ అమెరికా పర్యటనలో ఉండడంతో విస్తరణకు, కొత్త నియామకాలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేదా అనే ఉత్కంఠతో వందల మంది ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు. వారితో కర్ణాటక భవన్ కిక్కిరిసి పోగా, అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రిని కలవడానికి పలువురు పోటీ పడ్డారు. మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడంతో విస్తరణను కొంత కాలం పాటు వాయిదా వేయడమే మంచిదని సీఎం అనుకుంటున్నారు. దిగ్విజయ్ సింగ్ అమెరికా పర్యటనలో ఉండడం ఆయనకు కలిసొచ్చింది.

    దిగ్విజయ్ తిరిగి వచ్చిన తర్వాత, మరో దఫా దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుందామని  సీఎంకు అధిష్టానం సూచించినట్లు తెలిసింది. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నప్పటికీ, అధిష్టానం ఆ దిశగా ఆలోచించడం లేదు. అయితే మంత్రి వర్గంలో ఆయనకు చోటు కల్పించాలని ఇదివరకే సీఎంకు సూచించింది. కనుక అధిష్టానం అనుమతిస్తే పరమేశ్వరను మాత్రం చేర్చుకుని, తదుపరి విస్తరణను దసరా అనంతరం చేపట్టాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. మంత్రి వర్గంలో ప్రస్తుతం నాలుగే ఖాళీలున్నాయి.

    కనుక అందరినీ సముదాయించడం కన్నా, వాయిదా వేయడమే మంచిదని ఆయన అధిష్టానానికి సూచించారని  సమాచారం. మరో వైపు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే తాను మంత్రి వర్గంలో చేరబోనని పరమేశ్వర అధిష్టానానికి విన్నవించారని తెలిసింది. మంత్రిగా ఉండడం కన్నా కేపీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగడం మంచిదని ఆయన చెబుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

    ఎటూ మరో ఏడాదిన్నర పాటు తాను ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నందున, మంత్రి పదవిని తిరస్కరిస్తున్నారని తెలిసింది. ఏదేమైనా అధిష్టానం మాటే అందరికీ శిరోధార్యం కనుక, అటు వైపు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement