line cleared
-
వేదాంత విభజనకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: షేర్హోల్డర్లు, రుణదాతలు ఆమోదముద్ర వేయడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ విభజనకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో వ్యాపారాలను అల్యూమినియం, ఆయిల్ తదితర రంగాలవారీగా అయిదు కంపెనీలుగా విడదీస్తారు. డీమెర్జర్ స్కీము ప్రకారం వేదాంత షేర్హోల్డర్లకు ఒక్కో షేరుకు గాను కొత్తగా ఏర్పడే నాలుగు సంస్థలకు సంబంధించి అదనంగా ఒక్కొక్క షేరు చొప్పున లభిస్తుంది. కార్యకలాపాలను క్రమబదీ్ధకరించుకునేందుకు, వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ డీమెర్జర్ ఉపయోగపడుతుందని వేదాంత వెల్లడించింది. అలాగే, ఒక్కో స్వతంత్ర కంపెనీ వేర్వేరుగా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమకూర్చుకునేందుకు, వ్యూహాత్మక భాగస్వాములతో జట్టు కట్టేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొంది. అయిదు కంపెనీలుగా విడదీసే ప్రణాళికకు 99.99 శాతం మంది షేర్హోల్డర్లు, 99.59 శాతం మంది సెక్యూర్డ్ రుణదాతలు, 99.95 శాతం మంది అన్సెక్యూర్డ్ రుణదాతలు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. గురువారం బీఎస్ఈలో వేదాంత షేర్లు దాదాపు 2.40 శాతం పెరిగి రూ. 433.55 వద్ద క్లోజయ్యాయి. ఇంట్రాడేలో సుమారు 3 శాతం పెరిగి రూ. 435.50 స్థాయిని తాకాయి. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ. 3,969 కోట్లు పెరిగి రూ. 1,69,535 కోట్లకు చేరింది.ఇవీ కంపెనీలు.. విడదీత అనంతరం వేదాంత లిమిటెడ్ ప్రధానంగా వెండి, జింకు మొదలైన మెటల్స్ ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మిగతా కంపెనీల జాబితాలో వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత పవర్, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ ఉంటాయి. టెక్నాలజీ విభాగాలతో పాటు కొత్త వ్యాపారాలకూ వేదాంత ఇన్క్యుబేటరుగా వ్యవహరిస్తుంది. -
TS Election 2023: ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ అయినట్టేనా? ‘పల్లా’ కేనా..!?
సాక్షి, సంగారెడ్డి: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికే టికెట్ దక్కుతుందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆగస్టు 21న 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మెన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది. పల్లాకు లైన్ క్లీయర్ చేసేందుకే ముత్తిరెడ్డికి ఆ పదవిని ఇచ్చారని తెలుస్తోంది. పల్లాకే జనగామ ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు. దానికి తోడు ఇటీవల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తానే బరిలో ఉంటానని ప్రకటించడంతో నియోజకవర్గంలో జోరుగా చర్చసాగుతుంది. టికెట్ ఆశిస్తున్న నలుగురు నేతలు.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆప్కో మాజీ చైర్మెన్ మండల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం కుమారుడు కిరణ్ కుమార్ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. వాళ్లు నాలుగు వర్గాలుగా విడిపోయి గ్రూప్‌లుగా ఉంటున్నారు. ఎవరికి వారు తమకే అవకాశం వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ పల్లా.. జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుకునూరుపల్లి మండలం చిన్నకిష్టాపూర్‌లో జరిగిన సమావేశంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని కార్యకర్తలు కోరడంతో డివిజన్ ఏర్పాటు బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం. గతంలో సైతం రెండు మార్లు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ముత్తిరెడ్డి వ్యాఖ్యలతో.. టీఎస్ఆర్టీసీ చైర్మెన్‌గా యాదగిరిరెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో తానే బరిలో ఉంటాను అని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేను కాదని ఎమ్మెల్సీ దగ్గరికి వెళితే ఎలా? అనే సందిగ్ధంలో కార్యకర్తలు పడ్డారు. కొందరు కార్యకర్తలయితే తటస్థంగా వ్యవహరిస్తున్నారు.అభ్యర్థిని త్వరగా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. -
దసరా తర్వాతే
విస్తరణపై అధిష్టానాన్ని ఒప్పించిన సీఎం సిద్ధరామయ్య కలిసి వచ్చిన డిగ్గీ రాజ అమెరికా పర్యటన ఆయన వచ్చిన తర్వాతేతుది నిర్ణయమన్న హైకమాండ్ పరమేశ్వరకు లైన్ క్లియర్ ఉప ముఖ్యమంత్రి పదవికే కేపీసీసీ చీఫ్ పట్టు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణను వీలైనంత మేరకు వాయిదా వేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ దిశగా అధిష్టానాన్ని కూడా ఒప్పించగలిగారు. బుధవారం ఢిల్లీలో ఆయన పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలను చేపట్టాలనుకుంటున్నందున, దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. అంతకు ముందు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ అమెరికా పర్యటనలో ఉండడంతో విస్తరణకు, కొత్త నియామకాలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేదా అనే ఉత్కంఠతో వందల మంది ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు. వారితో కర్ణాటక భవన్ కిక్కిరిసి పోగా, అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రిని కలవడానికి పలువురు పోటీ పడ్డారు. మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడంతో విస్తరణను కొంత కాలం పాటు వాయిదా వేయడమే మంచిదని సీఎం అనుకుంటున్నారు. దిగ్విజయ్ సింగ్ అమెరికా పర్యటనలో ఉండడం ఆయనకు కలిసొచ్చింది. దిగ్విజయ్ తిరిగి వచ్చిన తర్వాత, మరో దఫా దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎంకు అధిష్టానం సూచించినట్లు తెలిసింది. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నప్పటికీ, అధిష్టానం ఆ దిశగా ఆలోచించడం లేదు. అయితే మంత్రి వర్గంలో ఆయనకు చోటు కల్పించాలని ఇదివరకే సీఎంకు సూచించింది. కనుక అధిష్టానం అనుమతిస్తే పరమేశ్వరను మాత్రం చేర్చుకుని, తదుపరి విస్తరణను దసరా అనంతరం చేపట్టాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. మంత్రి వర్గంలో ప్రస్తుతం నాలుగే ఖాళీలున్నాయి. కనుక అందరినీ సముదాయించడం కన్నా, వాయిదా వేయడమే మంచిదని ఆయన అధిష్టానానికి సూచించారని సమాచారం. మరో వైపు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే తాను మంత్రి వర్గంలో చేరబోనని పరమేశ్వర అధిష్టానానికి విన్నవించారని తెలిసింది. మంత్రిగా ఉండడం కన్నా కేపీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగడం మంచిదని ఆయన చెబుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎటూ మరో ఏడాదిన్నర పాటు తాను ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నందున, మంత్రి పదవిని తిరస్కరిస్తున్నారని తెలిసింది. ఏదేమైనా అధిష్టానం మాటే అందరికీ శిరోధార్యం కనుక, అటు వైపు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.