సాక్షి, సంగారెడ్డి: జనగామ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికే టికెట్ దక్కుతుందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆగస్టు 21న 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ జాబితాలో జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్ పదవిని బీఆర్‌ఎస్ పార్టీ కట్టబెట్టింది. పల్లాకు లైన్ క్లీయర్ చేసేందుకే ముత్తిరెడ్డికి ఆ పదవిని ఇచ్చారని తెలుస్తోంది. పల్లాకే జనగామ ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు. దానికి తోడు ఇటీవల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తానే బరిలో ఉంటానని ప్రకటించడంతో నియోజకవర్గంలో జోరుగా చర్చసాగుతుంది.
టికెట్ ఆశిస్తున్న నలుగురు నేతలు..
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆప్కో మాజీ చైర్మెన్ మండల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం కుమారుడు కిరణ్ కుమార్ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. వాళ్లు నాలుగు వర్గాలుగా విడిపోయి గ్రూప్‌లుగా ఉంటున్నారు. ఎవరికి వారు తమకే అవకాశం వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు.
సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ పల్లా..
జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కుకునూరుపల్లి మండలం చిన్నకిష్టాపూర్‌లో జరిగిన సమావేశంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని కార్యకర్తలు కోరడంతో డివిజన్ ఏర్పాటు బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం. గతంలో సైతం రెండు మార్లు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.
ముత్తిరెడ్డి వ్యాఖ్యలతో..
టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌గా యాదగిరిరెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో తానే బరిలో ఉంటాను అని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేను కాదని ఎమ్మెల్సీ దగ్గరికి వెళితే ఎలా? అనే సందిగ్ధంలో కార్యకర్తలు పడ్డారు. కొందరు కార్యకర్తలయితే తటస్థంగా వ్యవహరిస్తున్నారు.అభ్యర్థిని త్వరగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment