అల్‌ఖైదాపై అలర్‌ట
- శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించండి
- ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
మైసూరు : భారత ఉప ఖండంలో అల్‌ఖైదా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఎటువంటి వైఫల్యానికి తావు లేకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించామని చెప్పారు. ఇక్కడి విమానాశ్రయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అల్‌ఖైదా నుంచి ఎటువంటి హెచ్చరికలు లేనప్పటికీ, కేంద్రం నుంచి అందే ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తామని వెల్లడించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వవద్దని పోలీసు శాఖకు సూచించామని చెప్పారు. కాగా ఉత్తర కర్ణాటకలోని ఎనిమిది జిల్లాల్లో అతివృష్ట కారణంగా 22 మందితో పాటు 54 పశువులు మృ్యువాత పడ్డాయని తెలిపారు. సుమారు రూ.400 కోట్ల పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. శనివారం గుల్బర్గ, గదగ, రాయచూరు జిల్లాల్లో వైమానిక సర్వేను నిర్వహిస్తామని తెలిపారు.
ఇప్పటికే ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. బాధితులకు నష్ట పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా రాష్ర్టంలో మొబైల్ ఫోన్ల ద్వారా అత్యవసర ప్రభుత్వ సేవలను అందించనున్నట్లు తెలిపారు. త్వరలో ప్రారంభించబోయే ఈ కార్యక్రమం దేశంలోనే మొదటిదని ఆయన చెప్పారు.