ఉండేనా..ఊడేనా? | Cabinet reorganization concern | Sakshi
Sakshi News home page

ఉండేనా..ఊడేనా?

Published Mon, Nov 10 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

ఉండేనా..ఊడేనా?

ఉండేనా..ఊడేనా?

మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై అమాత్యుల ఆందోళన
పదవి పోతుందని భయం
సీనియర్ల గుండెల్లో రైళ్లు
ఐదు లేదా ఆరుగురిపై వేటు
నూతన జాబితాకు రాహుల్ ఓకే

 
రాష్ట్ర మంత్రి వర్గానికి త్వరలోనే సర్జరీలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన నేపథ్యంలో మంత్రి వర్గంలోని సీనియర్ మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ సర్జరీల్లో భాగంగా మంత్రి వర్గం నుంచి తమనే తప్పించబోతున్నారా.. అన్న ఆలోచనలు సీనియర్ మంత్రులను వేధిస్తున్నాయి. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లడంలో విఫలమైన వారిని మంత్రి వర్గం నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ పర్యటనలో ‘మంత్రి వర్గ పునర్వవస్థీకరణ భాగంలో కొంత మందిని తప్పించబోతున్నాం’ అని స్పష్టం చేశారు. దీంతో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఎవరికి ఉద్వాసన పలుకుతారనే విషయంపై సీనియర్ మంత్రుల్లో భయం నెలకొంది.

సీనియర్లే ఎందుకు....

ఉద్యానశాఖను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వయోభారంతో బాధపడుతుండడం వల్ల ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఇక రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్ ప్రసాద్ అనారోగ్య కారణాలతో తన శాఖను సమర్థవంతంగా నిర్వహించలేక పోతున్నారని హైకమాండ్‌కు నివేదిక అందింది. ఇక గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు తలెత్తుతున్నాయి. వీరితో పాటు మరికొందరు సీనియర్లను సైతం మంత్రి మండలి నుంచి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలోని సీనియర్లు తన మాట వినకపోవడం వల్లే సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మంత్రుల పనితీరుకు సంబంధించిన ‘వర్క్ రిపోర్ట్’ను అడిగిన సందర్భంలో కూడా సిద్ధరామయ్యపై సీనియర్ మంత్రు లు సీరియస్ అయ్యారు. ‘మమ్మల్నే వర్క్ రిపోర్ట్ అడుగుతారా..’ అని కొందరు ప్రశ్నిస్తే, మరికొందరేమో అధికారుల పనితీరు సరిగా లేదు, నిధులు రాలేదు అనే సాకులు చెబుతూ వర్క్ రిపోర్ట్‌ను ఇవ్వలేదు. దీంతో సీనియర్ మంత్రులను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు సిద్ధరామయ్య సన్నద్ధమైనట్లు తెలుస్తోంది.

రాహుల్ ఓకే..

ఇక ఢిల్లీ పర్యటన సమయంలో మంత్రి వర్గానికి యువ రక్తాన్ని చేర్చాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ  ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించినట్లు సమాచారం. మంత్రి వర్గం మరింత చురుగ్గా పనిచేసేందుకు గాను అసమర్థులైన మంత్రులను తప్పించి వారి స్థానంలో కార్యదక్షత ఉన్న యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను అప్పగించాలని రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను ఆదేశించారు. దీంతో చాలా కాలంగా మంత్రి వర్గ పునర్వవస్థీకరణ చేపట్టేందుకు వేచి చూస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత మంత్రి వర్గంలోని ఐదు లేదా ఆరుగురు సీనియర్లను మంత్రి వర్గం నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈనెల 16న నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఆ సమయంలో మంత్రి వర్గంలో చోటు కల్పించబోయే వారి జాబితాకు హైకమాండ్ నుంచి ఆమోదం పొందనున్నారని, అనంతరం మంత్రి వర్గ పునర్వవస్థీకరణను చేపట్టనున్నారని తెలుస్తోంది.       
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement