ఎవరిని తప్పించాలి ?
హస్తినకు మారిన రాజకీయాలు
డిగ్గి, అహ్మద్ పటేల్‌తో ముగిసిన చర్చలు
నేడు సోనియా, రాహుల్‌తో భేటీ కానున్న సీఎం సిద్ధు
అదే రోజు స్పష్టత ఇవ్వనున్న అధిష్టానం
మేడం ప్రసన్నం కోసం ఢిల్లీలో అమాత్యుల పాట్లు
బెంగళూరులో చకచకా పునర్ వ్యవస్థీకరణ ఏర్పాట్లు
బెంగళూరు : మంత్రి వర్గ ‘విస్తరణ’ అమాత్యుల్లో గుబులు రేపుతోంది. ఎక్కడ వేటు పడుతుందోనని మంత్రులు ఢిల్లీలో మేడం ప్రసన్నం కోసం పాట్లు పడుతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు హస్తినకు చేరుకున్నాయి. మంత్రి మండలి పునఃరచన కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లగా మండలిలో తమ స్థానాలు కాపోడుకోవడానికి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన అమాత్యులు హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చాలా కాలంగా వాయిదా పడుతున్న మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు ఎట్టకేలకు ముహుర్తం కుదరబోతున్న విషయం తెలిసిందే. ఈ ముహుర్తాన్ని ఖరారు చేసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. తొలుత పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో కూడా చర్చించారు. మరొసారి నేడు (శుక్రవారం) ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యి మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవుల న ుంచి తప్పించాల్సిన వారి వివరాలతో పాటు వారిని ఎందుకు తప్పించాల్సి వస్తోందో చివరిసారిగా వివరించనున్నారు. అంతేకాకుండా రానున్న శాసనసభ ఎన్నికలతో పాటు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వర్గాలకు చెందిన వారికి పదవుల్లో ప్రాధాన్యత కల్పించడానికి వీలుగా ఎవరెవరికీ మంత్రి పదవులు ఇవ్వాలన్న విషయాన్ని కూడా అధినాయకత్వానికి సిద్ధరామయ్య వివ రించనున్నారు.
తద్వారా మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి అన్ని పనులను పూర్తి చేయనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే శుక్రవారం సాయంత్రానికి పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవులు కోల్పోయేవారి విషయంపై స్పష్టతరానుంది. అదేవిధంగా శనివారం రోజు మంత్రి పదవులను దక్కించుకున్న వారు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు ఇప్పటికే గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాతో అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంత్రి పదవులను ఆశిస్తున్నవారితో పాటు మంత్రి పదవులు కోల్పోకూడదని గట్టి పట్టుదలతో ఉన్న నాయకులు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని లాబీయింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంత్రి పదవులు దక్కించుకునే వారిలో రాజ అలగూరు (నాగఠాన ఎమ్మెల్యే), హరీష్ (శాంతినగర), రుద్రప్ప లమాణి (హావేరి), ఎస్.టీ సోమశేఖర్ (యశ్వంత్‌పుర), కోలివాడ (రాణిబెన్నూరు), మాలకరెడ్డి (యాదగిరి), కాగోడు తిమ్మప్ప (సాగర), రమేష్‌కుమార్ (శ్రీనివాసపుర), బసవరాజరాయరెడ్డి (యలబుర్గి), ప్రమోద్ మధ్వరాజ్ (ఉడిపి), ప్రియాంక్ ఖర్గే (చిత్తాపుర), సుధాకర్ (హిరియూరు), కే.సుధాకర్ (చిక్కబళాపుర), మోటమ్మ (ఎమ్మెల్సీ)లు ముంద వరుసలో ఉన్నారు.
ఇదిలా ఉండగా మంత్రి మండలి నుంచి తప్పించే వారి పేర్లతో కూడిన జాబితా ఇప్పటికే హైకమాండ్‌కు చేరింది. ఇందులో వారిని తొలగించడానికి గల కారణాలు కూడా వివరించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జౌళిశాఖ మంత్రి బాబురావ్ చించన్‌సూరి, కార్మికశాఖ మంత్రి పరమేశ్వర్‌నాయక్, మైనారిటీ సంక్షేమశాఖమంత్రి ఖమరుల్‌ఇస్లాంపై పలు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వీరిని మంత్రి మండలి నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇక ఉద్యానశాఖ మంత్రి శామనూరు శివశంకరప్ప, రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్‌లు అనారోగ్యం వల్ల సరిగా విధులు నిర్వర్తించడం లేదని సమాచారం. ఇక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వినయ్‌కుమార్‌సూరకే, యువజన, క్రీడలశాఖ మంత్రి అభయ్ చంద్రజైన, విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉమాశ్రీలు ఆశించిన స్థాయిలో విధులు నిర్వర్తించడం లేదని సిద్ధరామయ్య భావిస్తున్నారు.
దీంతో వీరిని మంత్రి మండలి నుంచి సాగనంపాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు పౌరసఫరాలశాఖ మంత్రి దినేష్ గుండూరావ్‌ను జాతీయ రాజకీయాల్లోకి పంపించాలని హైకమాండ్ నిర్ణయించింది. దీంతో ఒకరికి ఒకటే పదవి అన్న కాంగ్రెస్ పార్టీ పాలసీ నేపథ్యంలో ఆయన్ను కూడా మంత్రి మండలి నుంచి తప్పించే అవకాశం ఉంది. ఇక ఇంధనశాఖ మంత్రి డీ.కే శివకుమార్, వ్యవసాయశాఖ మంత్రి కృష్ణభైరేగౌడతో పాటు ఐటీ శాఖ మంత్రి ఎస్.ఆర్ పాటిల్‌లో ఒకరికి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పీఠం దక్కే అవకాశం ఉండటంతో వీరిలో ఒకరిని మంత్రి మండలి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.