సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాల్లో చౌక మందుల (జెనరిక్) దుకాణాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. తద్వారా పేదలందరికీ భరించదగ్గ స్థాయిలోనే మందులు లభ్యమవుతాయని తెలిపారు. ఇక్కడి ఎస్‌డీఎస్ క్షయ రోగ పరిశోధనా కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సంస్మరణార్థం నిర్మించిన కొత్త ఆస్పత్రి భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు వివిధ వ్యాధులతో బాధ పడుతున్నారని, వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చును భరించే స్తోమత వారికి లేనందున అందరికీ ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తామని వెల్లడించారు. పెద్ద ఆస్పత్రుల్లో ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తేనే వ్యాధులు నయమవుతాయనే అపోహ చాలా మందిలో ఉందంటూ, వాటిని దూరం చేసుకోవాలని కోరారు.
రోగుల్లో విశ్వాసం కల్పించడానికి వైద్యులు ప్రయత్నించాలని సూచించారు. కాగా గుజరాత్‌లో మద్య నిషేధం విఫలమైందని, అక్కడ ఎవరూ తాగుడును మానుకోలేదని అన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలన్న ప్రతిపాదనపై ఆయన మాట్లాడుతూ, నిషేధం వల్ల అక్రమాలు పెరిగిపోతాయన్నారు.
వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాశ్ పాటిల్ మాట్లాడుతూ రాష్ర్టంలోని నాలుగు రెవెన్యూ జోన్లలో పేదల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి పాల్గొన్నారు.
తాలూకా కేంద్రాల్లో చౌక మందుల దుకాణాలు
Published Thu, Oct 31 2013 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement