Sharan Prakash Patil
-
ఇరు రాష్ట్రాలది స్నేహపూర్వక బంధం
బషీరాబాద్(తాండూరు): తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంత రైతాంగం ప్రయోజనాల కోసం ప్రభుత్వాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి శరణు ప్రకాశ్ పాటిల్ వెల్లడించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్, కర్ణాటక సరిహద్దులోని హల్కోడ సమీపంలో కాగ్నా నదిపై అక్కడి ప్రభుత్వం రూ.5.10 కోట్లతో నిర్మించిన అంతర్రాష్ట్ర అనుసంధాన వంతెనను మంత్రులు ప్రారంభించారు. కర్ణాటకలోని జెట్టూరు వద్ద రూ.25.65 కోట్లతో నిర్మించతలపెట్టిన బ్రిడ్జి కంబ్యారేజీకి తెలంగాణ అనుమతులు ఇవ్వడంతో ఇద్దరు మంత్రులు శంకుస్థాపన చేశారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు టీఎస్ ఆర్టీసీ 1,130 బస్సు సర్వీసులు నడుపుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర సరహద్దులోని కర్ణాటకను అనుసంధానిస్తూ వంతెనలు, రోడ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. శరణు ప్రకాశ్ పాటిల్ మాట్లాడుతూ 371జే ఆర్టికల్ ప్రకారం హైదరాబాద్–కర్ణాటక సరిహద్దు ప్రాంత అభివృద్ధి బోర్డు ద్వారా దక్షిణ కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, యాద్గిర్, రాయ్‌చూర్, కొప్పడ్ జిల్లాల్లో నాలుగేళ్లలోనే రూ.4,500 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. -
భారతీయ ప్రాచీన వైద్యం వైపు.. ప్రపంచ దేశాల చూపు
వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ సాక్షి, బెంగళూరు : భారతీయ ప్రాచీన వైద్య విధానాలైన యోగ, ఆయుర్వేద, సిద్ధ, యునానిల వైపు ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధులను న యం చేయడంతో పాటు ఆయుష్షును పెంచగల శక్తి ప్రాచీన వైద్య విధానాల సొంతమని అన్నారు. విరూపాక్ష బెళవడి రచించిన ‘సూర్యోపాసన’ పుస్తకాన్ని స్నేహబుక్ హౌస్ సంస్థ ద్వారా మార్కెట్లోకి తీసుకొచ్చారు. శనివారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో శరణ్ ప్రకాష్ పాటిల్ ఈ పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఎన్నో వ్యాధులను నియంత్రించేందుకు అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితాన్ని న గరవాసులు ఎదుర్కొంటున్నారని, అంతేకాక కాలుష్యంతో కూడిన వాతావరణం కూడా ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావం చూపుతోందని అన్నారు. ఇలాంటి సందర్భంలో యోగా అభ్యాసం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో శాండల్‌వుడ్ నటి మేఘనా గావ్కర్, హోమియో వైద్యుడు బి.టి.రుద్రేష్ తదితరులు పాల్గొన్నారు. -
తాలూకా కేంద్రాల్లో చౌక మందుల దుకాణాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాల్లో చౌక మందుల (జెనరిక్) దుకాణాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. తద్వారా పేదలందరికీ భరించదగ్గ స్థాయిలోనే మందులు లభ్యమవుతాయని తెలిపారు. ఇక్కడి ఎస్డీఎస్ క్షయ రోగ పరిశోధనా కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సంస్మరణార్థం నిర్మించిన కొత్త ఆస్పత్రి భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వివిధ వ్యాధులతో బాధ పడుతున్నారని, వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చును భరించే స్తోమత వారికి లేనందున అందరికీ ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తామని వెల్లడించారు. పెద్ద ఆస్పత్రుల్లో ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తేనే వ్యాధులు నయమవుతాయనే అపోహ చాలా మందిలో ఉందంటూ, వాటిని దూరం చేసుకోవాలని కోరారు. రోగుల్లో విశ్వాసం కల్పించడానికి వైద్యులు ప్రయత్నించాలని సూచించారు. కాగా గుజరాత్లో మద్య నిషేధం విఫలమైందని, అక్కడ ఎవరూ తాగుడును మానుకోలేదని అన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలన్న ప్రతిపాదనపై ఆయన మాట్లాడుతూ, నిషేధం వల్ల అక్రమాలు పెరిగిపోతాయన్నారు. వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాశ్ పాటిల్ మాట్లాడుతూ రాష్ర్టంలోని నాలుగు రెవెన్యూ జోన్లలో పేదల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి పాల్గొన్నారు.