ఆవిష్కరణ వివాదం | The discovery dispute | Sakshi
Sakshi News home page

ఆవిష్కరణ వివాదం

Published Thu, Oct 2 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

The discovery dispute

  • ప్రొటోకాల్ పాటించడం లేదంటూ  మంత్రి రోషన్‌బేగ్ ఆగ్రహం
  •  ఆహ్వాన కమిటీ చైర్మన్ శంకరమూర్తిపై విమర్శలు
  •  ప్రొటోకాల్ మేరకే ఆహ్వానమన్న మండలి అధ్యక్షుడు
  •  కార్యక్రమాన్ని వాయిదా వేయాలని వాటల్ వినతి
  •  గాంధేయవాదులను విస్మరించారని ఆరోపణ
  •  ఆహ్వాన పత్రికలో నగర ప్రథమ మహిళ పేరును ప్రస్తావించకపోవడంపై అసహనం
  • సాక్షి, బెంగళూరు : జాతిపిత విగ్రహావిష్కరణ కార్యక్రమం నేతల మధ్య వివాదానికి తెరలేపింది. విధానసౌధ, వికాససౌధ మధ్య 22 అడుగుల ఎత్తై గాంధీ విగ్రహాన్ని నేడు(గురువారం) ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ విషయంలో ప్రోటోకాల్‌కు తిలోదకాలిచ్చారంటూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

    ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో పాటించాల్సిన నియమాలను విస్మరించారని అసహనం వ్యక్తంచేశారు. గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం శివాజీనగర నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేనైన తానే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఈ విషయాలు ఏవీ తెలియని శాసన మండలి అధ్యక్షుడు డి.హెచ్.శంకరమూర్తి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారని మండిపడ్డారు.

    కాగా, అసెంబ్లీ, మండలి సభా కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక చానల్‌కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమతి తెలిపారని అన్నారు. త్వరలో చానల్ ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే న్యాయపరమైన చిక్కుల వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన కేబుల్ నెట్‌వర్క్ వ్యవస్థ ఆలస్యమవుతోందని పేర్కొన్నారు.

    ప్రోటోకాల్ మేరకే ఆహ్వానం

    మహాత్ముడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించే విషయంలో తాము పారదర్శకంగానే ఉన్నామని విధానపరిషత్ సభాపతి డి.హెచ్.శంకరమూర్తి స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వహణలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ రాష్ట్ర మంత్రి రోషన్‌బేగ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.

    బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆవిష్కరణకు సంబంధించి తన అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పారదర్శకంగానే వ్యవహరిస్తోందని అన్నారు. శాసనసభ, మండలి విపక్ష నేతలను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించినట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, జగదీష్‌శెట్టర్, ఎస్‌ఎం ృ ష్ణను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. అయితే కమిటీ సభ్యులు సూచన మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కొద్ది మంది పేర్లు మాత్రమే ఆహ్వాన పత్రికలో ముద్రించినట్లు చెప్పారు.  
     
    విగ్రహావిష్కరణను వాయిదా వేయండి

    గాంధీజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని శాసనమండలి అధ్యక్షుడు డీహెచ్ శంకరమూర్తిని మాజీ శాసనసభ్యుడు వాటాళ్ నాగరాజు కోరారు.  ఈ మేరకు బుధవారం ఆయన విధానసౌధలో శాసనమండలి అధ్యక్షున్ని కలుసుకుని ఓ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రంలోని గాంధేయవాదులతోపాటు అర్హులైన చాలామందిని ప్రభుత్వం ఆహ్వానించలేదన్నారు.

    అంతేకాక ఆహ్వాన పత్రికల్లో ప్రోటోకాల్ ప్రకారం పేర్లను ముద్రించక పోవడం వల్ల వారికి అవమానం జరిగిందని చెప్పారు. నగర ప్రథమ మహిళ, బీబీఎంపీ మేయర్ శాంతకుమారి పేరు కూడా ఆహ్వాన పత్రికలో లేకపోవడం ఇందుకు నిదర్శనమని అసహనం వ్యక్తం చేశారు. అందువల్ల కార్యక్రమాన్ని వాయిదా వేసి ప్రోటోకాల్ పాటిస్తూ అందరినీ ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement