పదవుల కోసం పట్టు
- ముఖ్యమంత్రిపై పెరుగుతున్న ఒత్తిడి
- కేపీసీసీ చీఫ్‌తో సీఎం మంతనాలు
- తొలగింపు జాబితాలో శామనూరు, శ్రీనివాసప్రసాద్, వినయ్‌కుమార్ సొరకె, కిమ్మనె
- పరిశీలనలో ఎస్‌ఎస్ మల్లికార్జున, అరకలగూడు మంజు, కోళివాడ, మాలికయ్య గుత్తేదార్ పేర్లు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కోసం పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఉప ఎన్నికలకు ముందే మంత్రి వర్గాన్ని విస్తరించాలని వారు పట్టుబడుతున్నారు. ఇటీవలే అనేక మంది ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయం కృష్ణాలో ఆయనను కలుసుకుని తమకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని పట్టుబట్టారు. దీనిపై ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు గురువారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ సమావేశాలు వచ్చే వారం ముగియనున్నాయి.
అనంతరం మూడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ , కార్పొరేషన్లు, బోర్డులకు నియామకాలపై అధిష్టానంతో చర్చించడానికి వారు ఉభయులూ ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణ కన్నా పునర్వ్యవస్థీకరణపైనే సీఎం ఆసక్తి చూపుతున్నారు. సరిగ్గా పని చేయని కొందరు మంత్రులను తొలగించి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారు. మంత్రులు శామనూరు శివశంకరప్ప, శ్రీనివాస ప్రసాద్, వినయ్ కుమార్ సొరకె, కిమ్మనె రత్నాకర్‌లను తొలగించాలనుకుంటున్నారు.
వయో భారంతో అవస్థలు పడుతున్న శివశంకరప్ప తన స్థానంలో తన కుమారుడు ఎస్‌ఎస్. మల్లిఖార్జునకు స్థానం కల్పించాలని కోరుతున్నారు. సీఎం కూడా ఆయన విన్నపం పట్ల సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. కొత్తగా ఆమాత్య యోగం పట్టబోతుందనుకున్న వారి జాబితాలో అరకలగూడు మంజు, కేబీ. కోళివాడ, మాలికయ్య గుత్తేదార్ పేర్లు ఉన్నట్లు సమాచారం. స్పీకర్ కాగోడు తిమ్మప్ప కూడా తనకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని పట్టుబడుతున్నారు.
గత ఏడాది ఆయన అయిష్టంగానే ఈ పదవిని చేపట్టారు. ఒక వేళ ఆయన కోరుకున్నట్లు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే, బసవరాజ రాయరెడ్డి కొత్త స్పీకర్ అయ్యే అవకాశాలున్నాయి. శాసన సభ సమావేశాల తర్వాత ఢిల్లీకి వెళ్లనున్న సీఎం, పరమేశ్వరలు అధిష్టానంతో జరిపే చర్చల్లో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.