- ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం వ్యూహం
- విజయానికి కారకులైన వారికే పదవులు అంటూ ఆశావహులకు ఎర
- 10 నుంచి ప్రచారానికి సీఎం, కేపీసీసీ చీఫ్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని మూడు శాసన సభ స్థానాలకు ఈ నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. వీటిలో రెండు సీట్లు బీజేపీ ఆధీనంలో ఉన్నాయి. మొత్తం మూడు సీట్లను గెలుచుకోవడం ద్వారా ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆయా నియోజక వర్గాల్లో అన్ని వర్గాలను ఏక తాటిపైకి తీసుకు రావడం ద్వారా గెలుపు సొంతం చేసుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారు.
ఉప ఎన్నికలు ముగియగానే కార్పొరేషన్లు, బోర్డులకు నియామకాలుంటాయని ఆశావహులకు తాయిలాలు చూపిస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయానికి కారకులైన వారికే ఈ పదవులంటూ ఊరిస్తున్నారు. మూడు నియోజక వర్గాలకు ఇన్‌ఛార్జిలుగా నియమితులైన మంత్రులతో పాటు తాలూకా స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు సైతం...ఆ పదవులు మీకేనంటూ ద్వితీయ శ్రేణి నాయకులను ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు.
ఉప ఎన్నికలు జరగాల్సిన శివమొగ్గ జిల్లాలోని శికారిపుర, బళ్లారి గ్రామీణ నియోజక వర్గాల్లో బీజేపీకి గట్టి పట్టుంది. ఆ పార్టీ నుంచి ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవడం కాంగ్రెస్‌కు పెద్ద సవాలే. ఆ నియోజక వర్గాల్లో బీజేపీకి బలముందని చెప్పడం కంటే మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ మంత్రి శ్రీరాములుకు మంచి పలుకుబడి ఉందని చెప్పడమే నగ్న సత్యమవుతుంది. గత శాసన సభ ఎన్నికల్లో శికారిపుర నుంచి యడ్యూరప్ప కేజేపీ టికెట్టుపై, బళ్లారి గ్రామీణ నుంచి శ్రీరాములు బీఎస్‌ఆర్ కాంగ్రెస్ టికెట్టు మీద గెలుపొందిన సంగతి తెలిసిందే.
కనుక వారి వ్యక్తిగత ప్రతిష్టే బీజేపీకి శ్రీరామ రక్ష అవుతుందని చెప్పక తప్పదు. మరో స్థానం చిక్కోడి-సదలగలో గతంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాశ్ హుక్కేరి గెలుపొందారు. సిద్ధరామయ్య మంత్రి వర్గంలో కూడా పని చేశారు. సరైన అభ్యర్థి లేరనే సాకుతో హుక్కేరికి ఇష్టం లేకున్నా అధిష్టానం లోక్‌సభ ఎన్నికల్లో ఆయనను బరిలో దింపింది. ఇప్పుడు ఆయన తనయుడు గణేశ్ హుక్కేరి పోటీ చేస్తున్నారు. ప్రకాశ్ హుక్కేరితో పాటు యడ్యూరప్ప, శ్రీరాములు లోక్‌సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. అందువల్లే ఇప్పుడు ఉప ఎన్నికలను నిర్వహించాల్సి వస్తోంది.
10 నుంచి సీఎం, పరమేశ్వర ప్రచారం
తన ఒంటెత్తు పోకడల వల్లే లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందని పార్టీలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉప ఎన్నికలకు అప్రమత్తమయ్యారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరతో ఆయనకు విభేదాలున్న సంగతి బహిరంగ రహస్యమే. ఈసారి ఆయనతో కలసే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 10 నుంచి ఉభయులూ సంయుక్తంగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బళ్లారి గ్రామీణ, శికారిపురల్లో మూడేసి రోజులు, చిక్కోడి-సదలగలో రెండు రోజులు వారిద్దరూ ప్రచారం చేయనున్నారు. జేడీఎస్ పోటీలో లేనందున లౌకిక ఓట్లలో చీలిక ఉండబోదని, కనుక గెలుపు ఖాయమని కాంగ్రెస్ విశ్వాసంతో ఉంది.