పోలీసు శాఖల్లో పెద్ద ఎత్తున జరిగిన బదిలీల్లో తమ మాటకు విలువ లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : పోలీసు శాఖల్లో పెద్ద ఎత్తున జరిగిన బదిలీల్లో తమ మాటకు విలువ లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం తన నివాసంలో హోం మంత్రి కేజే. జార్జితో పాటు సీనియర్ పోలీసు అధికారులతో సమాలోచనలు జరిపారు. ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీపీ, డీఎస్‌పీ, సీఐల స్థాయి అధికారులు 600 మందికి బుధవారం రాత్రి స్థాన చలనం కలిగించారు.
ఇదివరకే ప్రభుత్వోద్యోగుల బదిలీల్లో మంత్రులు తమ మాట వినడం లేదని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారుల బదిలీల్లో కూడా తమను విస్మరించడంతో ఏకంగా కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరకు ఫిర్యాదు చేశారు. కొందరు నేరుగా ముఖ్యమంత్రిని కలుసుకుని తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. గురువారం రాత్రి హఠాత్తుగా సమన్వయ సంఘం ఏర్పాటైన నేపథ్యంలో ఎమ్మెల్యేల అసంతృప్తిని తేలికగా తీసుకోరాదని నిర్ణయించిన ముఖ్యమంత్రి తక్షణ చర్యలకు ఉపక్రమించారు.
ముఖ్యమంత్రిని కలుసుకున్న ఎమ్మెల్యేల్లో కొందరు ఈ విషయాన్ని సమన్వయ సంఘం అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకెళతామని కూడా హెచ్చరించినట్లు సమాచారం. దీంతో బదిలీల్లో అభ్యంతరాలున్న ఎమ్మెల్యేల సూచనలకు అనుగుణంగా మార్పులు చేయాలని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే రిలీవ్ అయిన వారు మినహా మిగిలిన వారందరూ తమ పూర్వ స్థలాల్లోనే ఉండాల్సిందిగా సూచనలు కూడా వెళ్లాయి. మరో వైపు నగరంలో బదిలీ ఆదేశాలు అందుకున్న ఇన్‌స్పెక్టర్లు తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు రిలీవ్ కావద్దని పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ సూచించారు. ఇదివరకే రిలీవ్ అయిన వారికి ఈ ఆదేశాలు వర్తించవని తెలిపారు. నగరంలో 26 మంది ఏసీపీలు, వంద మందికి పైగా సీఐలపై బదిలీ వేటు పడింది.
కోర్టు మార్గదర్శకాల ప్రకారమే బదిలీలు
ఏసీపీలు, డీఎస్‌పీలు, ఇన్‌స్పెక్టర్ల బదిలీల్లో ఎవరూ జోక్యం చేసుకోలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. డీజీపీ అధ్యక్షతన ఏర్పాటైన పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సులు, సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం బదిలీలు జరిగాయని వివరించారు. హోం మంత్రితో సమాలోచనల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగా మండ్యలో ఈ నెల 30న జరిగే సోనియా గాంధీ బహిరంగ సభకు రెండు లక్షల మంది హాజరవుతారని ఆయన తెలిపారు.