కీచక పర్వంపైప్రజాగ్రహం
- కేంబ్రిడ్జి పాఠశాల ఎదుట ఆందోళనలు
- భారీ బందోబస్తు ఏర్పాటు
- నిందితుడు జైశంకర్ అరెస్ట్
సాక్షి, బెంగళూరు : ఉద్యాననగరిలో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. విబ్‌గయార్, ఆర్కిడ్ సంఘటనలు మరచిపోకముందే కేంబ్రిడ్జి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో హిందీ బోధనతో పాటు పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న జై శంకర్ అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగుచూసిన విష యం తెలిసిందే.
ఈ ఘటనలో జైశంకర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో శుక్రవారం వెల్లడించారు. మరోవైపు నిందితుడు జైశంకర్‌ను బెంగళూరు న్యాయస్థానంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి అనుమతి మేరకు వారంరోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఈ కేసు దర్యాప్తు మల్లేశ్వరం ఉపవిభాగం ఏసీపీ సారాఫాతిమా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజా ఘటనల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
తనిఖీ రోజే ఆకృత్యం... కేంబ్రిడ్జ్ పాఠశాల బెంగళూరు దక్షిణ విభాగం పరిధిలోకి వస్తుంది. పాఠశాలలో భద్రతా చర్యల కోసం ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లైన్‌పై ఈనెల 28న బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి (బీఈఓ) రమేష్ నేతృత్వంలో కేంబ్రిడ్జ్ పాఠశాలలో తనిఖీ నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఈ కార్యక్రమం కొనసాగింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత నిందితుడు చిన్నారిని మొదటి అంతస్తులోని బాలుర శౌచాలయంలోకి బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల పరిశీలనలో తేలింది. తర్వాతి రోజు (అక్టోబర్ 29న) కూడా ఇదే విధంగా చిన్నారిపై జైశంకర్ లైంగికదాడికి పాల్పడ్డాడు.
అనంతరం చిన్నారి తన జననేంద్రియాల వద్ద సమస్యగా ఉందంటూ తల్లికి చెప్పడంతో ఆమె బాలికను గైనకాలజిస్టు వద్దకు తీసుకెళ్లింది. వైద్యుల పరీక్షల్లో చిన్నారి లైంగిక దాడికి గురైనట్లు గుర్తించారు. తర్వాత వైద్యులు, స్వచ్ఛంద సంస్థల సూచనల మేరకు బాధిత చిన్నారి తల్లిదండ్రులు స్థానిక జీవన్‌భీమా నగర్‌లో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా విచారణలో శంకర్ ఇంటి వద్ద హిందీ ట్యూషన్లు చెప్పేవాడని తేలింది. ఆ సమయంలో బాధిత విద్యార్థిని తల్లి హిందీ నేర్చుకోవడం కోసం జై శంకర్ వద్దకు గతంలో ట్యూషన్‌కు వెళ్లేవారిని సమాచారం. ఇదిలా ఉంటే నిందితుడి కుమారుడు కూడా ఇదే పాఠశాలలో చదువుతుండటం గమనార్హం.
అగ్నిగోళంగా మారిన ప్రజాగళం...
చిన్నారిపై అత్యాచారం విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేశంతో రగిలిపోయారు. పాఠశాల వద్దకు చేరుకుని నిందితున్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉదయం ఎనిమిది గంటలకే వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకుని పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినదించారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ఈ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు.
అదేవిధంగా 11 గంటల సమయంలో సీ.వీ రామన్‌నగర్ శాసనసభ్యుడు (బీజేపీ) రఘు నేతృత్వంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. బెంగళూరులో ప్రతి రోజూ ఏదోఒక చోట పిల్లలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నైతిక బాధ్యత వహిస్తూ హోంశాఖ మంత్రి కే.జేజార్జ్‌తోపాటు సీఎం సిద్ధరామయ్య తమ పదవులకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే రఘు ఈసందర్భంగా డిమాండ్ చేశారు.
ఇంత జరుగుతున్నా పాఠశాల యాజమాన్యానికి చెందిన ఒక్కరు కూడా అటు విద్యాశాఖకు కానీ ఇటు పోలీసుశాఖకు కానీ అందుబాటులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, పాఠశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీస్‌కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి స్వయంగా పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
బుధవారం పాఠశాల పునఃప్రారంభం!
పాఠశాల విద్యార్థినిపై అత్యాచార విషయం గురువారం రాత్రి వెలుగులోకి రావడంతో పాఠశాల యాజమాన్యం శుక్రవారం స్కూల్‌కు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమై సంఘటన పట్ల చర్చించారు. ఈ సందర్భంగా పాఠశాలలో భద్రతా చర్యలు సరిగా లేవ ంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. పరిస్థితి చక్కబడేంతవరకూ తమ పిల్లలను పాఠశాలకు పంపేది లేదని తేల్చిచెప్పారు. చివరికి అందరూ కలిసి పాఠశాలను బుధవారం పునఃప్రారంభించడానికి నిర్ణయించారు. మరోవైపు ఈ విషయమై సోమవారం మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు.
నిర్లక్ష్యపు సమాధానాలు!
కేంబ్రిడ్జ్ పాఠశాల ఉదంతం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంశాఖ మంత్రి కే.జే. జార్జ్ చేసిన వ్యాఖ్యల పట్ల సామాజిక వేత్తలతో పాటు తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారి వ్యాఖ్యలు ప్రజలను కాపాడటంలో ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య వైఖరికి అద్ధం పడుతున్నాయని విమర్శిస్తున్నారు.
పాఠశాల యాజమాన్యానిదే బాధ్యత : పాఠశాలల్లో ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లో జరిగే అత్యాచారాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు. ఆయా పాఠశాలల యాజమాన్యానిదే బాధ్యత. అయితే అకృత్యానికి పాల్పడినవారు ఎవరైనా చట్టం ప్రకారం వారిని కఠినంగా శిక్షిస్తాం.
- సీఎం
తల్లిదండ్రులదే ఎక్కువ బాధ్యత:
పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల రక్షణ విషయంపై ఎక్కువ దృష్టి సారిస్తే ‘కేంబ్రిడ్’్జ వంటి ఘటనలు పునరావృతం కావు. ప్రతి చోటుకూ వెళ్లి పోలీసులు రక్షణ కల్పించడానికి వీలుకాదుకదా?
- హోంశాఖ మంత్రి