జిల్లాకొక మెడికల్ కళాశాల
సీఎం సిద్ధరామయ్య
ఐదు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కళాశాలతో పాటు ఐదు ప్రాంతాల్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. తద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం చేరువ చేసేందుకు వీలుకలుగుతుందని అన్నారు.
బెంగళూరులోని జయదేవ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు అత్యాధునిక కార్డియాక్ క్యాథ్‌ల్యాబ్‌లను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాకొక మెడికల్ కళాశాల ఏర్పాటు వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు కూడా వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు.
మైసూరు, గుల్బర్గా, హుబ్లీ, బళ్లారి, బెల్గాంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించనున్నట్లు చెప్పారు. జయదేవ ఆస్పత్రి డెరైక్టర్ సి.ఎన్.మంజునాథ్ మాట్లాడుతూ దేశంలో ఏడు క్యాథలిక్ ల్యాబ్‌లు ఉన్న వైద్య సంస్థ తమదేనని తెలిపారు. నిరుపేదలకు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మైసూరులో 350 పడకల సామర్థ్యం గల మరోశాఖను రెండేళ్లలో ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.