రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా శనివారం కేపీసీసీ కార్య వర్గ సమావేశం జరుగనుంది. నగరంలో ఓ హోటల్‌లో నిర్వహించే
= నేడు కేపీసీసీ కార్యవర్గ సమావేశం
= సీఎంపై 20 మంది ఎమ్మెల్యేలు గుర్రు
= బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకంలో జాప్యంపై అలక
= అమీ తుమీ తేల్చుకోడానికి సన్నాహాలు
= సమావేశానికి గైర్హాజర్ కానున్న దిగ్విజయ్ సింగ్
= నిరుత్సాహంలో అసమ్మతివాదులు
= అయినా నిరసన గళం విప్పేందుకు సిద్ధం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా శనివారం కేపీసీసీ కార్య వర్గ సమావేశం జరుగనుంది. నగరంలో ఓ హోటల్‌లో నిర్వహించే ఈ సమావేశం గురించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర శుక్రవారం సుదీర్ఘంగా చర్చించారు. సీఎం నివాసానికి వెళ్లిన ఆయన కార్య వర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు సీఎంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు.
అధికారుల బదిలీల్లో తమ మాటకు ఏ మాత్రం విలువ ఇవ్వలేదని చాలా మంది ఎమ్మెల్యేలు సీఎంపై గుర్రుగా ఉన్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తున్నప్పటికీ బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకంపై కసరత్తు కూడా ప్రారంభించనందుకు ఆశావహులు అలకబూనారు. కేపీసీసీ కార్య వర్గ సమావేశంలో దీనిపై అమీ తుమీ తేల్చుకోవాలని నిర్ణయించినా, వారి ప్రయత్నాలు సఫలమయ్యే సంకేతాలు కనిపించడం లేదు.
దిగ్విజయ్ సింగ్ ఈ సమావేశానికి రావడం అనుమానమేనని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పరిశీలకులు శాంత కుమార్ నాయక్, సెల్వ కుమార్ మాత్రమే పాల్గొంటారని తెలిసింది. అయినా అసంతృప్తి స్వరాన్ని వినిపించేందుకు చాలా మంది పట్టుదలతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలతో పాటు మంత్రి వర్గంలో ఖాళీల భర్తీ, బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలు తదితర అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి.
మూడు నెలలకోసారి సమావేశం..
కాంగ్రెస్ కార్య వర్గ సమావేశాన్ని ఇకమీదట మూడు నెలలకోసారి నిర్వహించాలని నిర్ణయించినట్లు డాక్టర్ జీ. పరమేశ్వర తెలిపారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై సమావేశంలో చర్చిస్తామన్నారు. ఇదివరకే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందన్నారు. దీనిపై పరిశీలకులు ఇచ్చిన నివేదికపై చర్చిస్తామన్నారు.
జేడీఎస్ కార్యాలయ భవనం కాంగ్రెస్ ఆస్తి అని హైకోర్టు ఆదేశాలిచ్చినందున, దానిపై కూడా చర్చిస్తామని చెప్పారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలను గెలుచుకోవాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. దీనిపై వెలువడిన ‘సీ ఓటర్’ సర్వేను ప్రస్తావిస్తూ, శాసన సభ ఎన్నికలకు ముందు కూడా నిర్వహించిన వివిధ సర్వేల్లో తొలుత కాంగ్రెస్‌కు 80, తర్వాత 100 స్థానాలు వస్తాయనే అంచనాలు తలకిందులయ్యాయన్నారు. 122 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ సొంతంగా అధికారాన్ని చేపట్టిందని గుర్తు చేశారు.