= పథకాన్ని విస్తరించాల్సిందే
= లేకుంటే రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యమం
= ధర్నాలో సీఎంపై యడ్డి ధ్వజం
= 24వ తేదీ వరకూ ధర్నా పొడిగింపు
సాక్షి, బెంగళూరు : షాదీ భాగ్య పథకాన్ని అన్ని వర్గాల వారికీ విస్తరింపజేయాలని గత నెల 31 నుంచి చేపట్టిన ధర్నాను ఈ నెల 24 వరకూ పొడిగించినట్లు కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) అధ్యక్షుడు యడ్యూరప్ప బెంగళూరులో తెలిపారు. బెంగళూరు ఆనందరావు సర్కిల్‌లో చేపట్టిన ఈ ధర్నా మంగళవారంతో ముగించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో ధర్నాను పొడిగించినట్లు యడ్డి స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ తన డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించకుంటే పార్టీ కార్యకర్తలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతానని హెచ్చరించారు. ఓ వర్గం ఓట్లు రాబట్టుకోడానికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇలా నీచ రాజకీయాలకు తెర తీశారని దుయ్యబట్టారు. కాగా, ఈ ధర్నాకు ఇతర విపక్ష పార్టీల నుంచి సరైన మద్దతు లభించడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు యడ్యూరప్ప స్పందించడానికి నిరాకరించారు.