- నూతన పారిశ్రామిక
- విధానానికి మంత్రి మండలి ఆమోదం
సాక్షి, బెంగళూరు : నూతన పారిశ్రామిక విధానానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధానసౌధలో గురువారం జరిగిన మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఫలితంగా రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 15 లక్షల మందికి ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి రంగాలలో విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయి. మంత్రి మండలి నిర్ణయాలను మీడియా సమావేశంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర వెల్లడించారు. నూతన విధానంలో ఉత్పాదన రంగానికి పెద్ద పీట వేసి ఇందులో 20 శాతం అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
2014 నుంచి 2019 వరకూ అమల్లో ఉండే ఈ నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా రూ.5 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగాల కల్పనలో స్థానికులకు పెద్ద పీట వేయనుంది. రాష్ట్రంలోని మొత్తం తాలూకాలను ఆరు జోన్లుగా విభజించడం ద్వారా స్థానికతకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటు, రాయితీలు తదితర విషయాల్లో పారదర్శకత పెరుగనుంది.
పరిశ్రమలు స్థాపించే ప్రాంతం, పెట్టుబడి పరిమాణాన్ని పరిగణలోకి తీసుకుని వడ్డీ రహిత రుణాలు ఇవ్వడంతో పాటు ఏడు నుంచి 14 శాతం వరకు వ్యాట్ నుంచి మినహాయింపు కూడా ఇవ్వనున్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలను ప్రోత్సహించే దిశగా ఆరహళ్లి, హుబ్లీ - ధార్వాడల్లో ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు.
పారిశ్రామిక అవసరాల కోసం భూములు ఇచ్చే కుటుంబంలో అర్హులైన ఒకరికి తప్పక ఉద్యోగం కల్పించడాన్ని చట్టబద్ధం చేయనున్నారు. మాతా శిశుమరణాలను అరికట్టడంలో భాగంగా రాష్ట్రంలోని 10 జిల్లాల్లో మాత్రం అమల్లో ఉన్న ‘మడలు’ పథకాన్ని మిగిలిన అన్ని జిల్లాలకు విస్తరించడానికి మంత్రిమండలి అంగీకరించింది. రాష్ట్రంలో నూతనంగా మూడు ప్రైవేట్ వైద్య కళాశాలకు అనుమతి లభించింది. హగరి నదిపై వంతెన నిర్మాణానికి అవసరమైన రూ.33.69 కోట్ల నిధుల విడుదలకు కూడా మంత్రి మండలి ఆమోదం దక్కింది.