రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినప్పటికీ కాంగ్రెస్‌లో అసమ్మతి కార్యకలాపాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. అధికారుల బదిలీలపై మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినప్పటికీ కాంగ్రెస్‌లో అసమ్మతి కార్యకలాపాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. అధికారుల బదిలీలపై మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు చిన్నగా రచ్చకెక్కుతున్నాయి. మంత్రులు తమ సూచనలను పట్టించుకోవడం లేదని పలువురు ఎమ్మెల్యేలు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరకు ఫిర్యాదు చేయడం తాజా పరిణామం.
రెండు నెలల కిందట ఇదే విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించినట్లు లేదు. వివిధ శాఖల అధికారుల బదిలీలపై మంత్రులు తమ సూచనలను పట్టించుకోవడం లేదని ఇప్పటికే గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలు, బుధవారం జరిగిన సీఐల బదిలీల్లో కూడా తమ మాట చెల్లుబాటు కానందుకు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.
ముఖ్యమంత్రి ఒంటెత్తు పోకడలను అనుసరిస్తున్నారని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓ రిటైర్డ్ పోలీసు అధికారి రూపొందించిన జాబితా ప్రకారం సీఐల బదిలీలు జరిగాయని, తమ మాటకు కించిత్తయినా విలువ ఇవ్వలేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. తమ మాట వినని పోలీసు అధికారులుంటే నియోజక వర్గాల్లో ఇబ్బందులు తప్పవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ నియోజక వర్గాల్లో తాము కోరుకున్న పోలీసు అధికారులనే నియమించాలని ఎమ్మెల్యేలు పరమేశ్వర వద్ద మొర పెట్టుకుంటున్నారు.
సమన్వయ సంఘం ఏర్పాటు
పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడానికి కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైంది. ఈ సమన్వయ సంఘానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోం మంత్రి కేజే. జార్జ్, మాజీ మంత్రి డీకే. శివకుమార్, ఏఐసీసీ కార్యదర్శి సెల్వ కుమార్‌లు సభ్యులు. బీజేపీకి చెందిన మాజీ మంత్రి ముమ్తాజ్ అలీఖాన్ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా పరమేశ్వర గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు సమన్వయ కమిటీ ఏర్పాటైందన్నారు.
ఈ కమిటీ వల్ల మంత్రులు మరింత చక్కగా పని చేయడానికి ఆస్కారం కలుగుతుందన్నారు. తనకు, ముఖ్యమంత్రికి మధ్య ఎలాంటి విభేదాలూ లేవని ఆయన స్పష్టం చేశారు. మరో వైపు మండ్య జిల్లాలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడం కాంగ్రెస్‌లో కొత్తేమీ కాదని అన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు ముమ్తాజ్ అలీఖాన్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రకటించినందున, తాను ఆ పార్టీ నుంచి వైదొలగినట్లు ఖాన్ తెలిపారు.