సాక్షి, బెంగళూరు : మెజిస్టిక్ నుంచి నిత్యం రద్దీగా నడిచే ఎలక్ట్రానిక్ సిటీ, చందాపుర, అత్తిబెలెలకు బీఎంటీసీ సోమవారం 62 ‘బిగ్ ట్రంక్’ బస్సులను ప్రవేశ పెట్టింది. ఇకమీదట ఆ మార్గాల్లో ప్రతి రెండు, మూడు నిమిషాలకో సర్వీసు నడుస్తుంది. ఈ మొత్తం మార్గాన్ని ‘ట్రంక్3’గా వ్యవహరిస్తారు. ఈ మార్గాల్లోని బస్సులను సులభంగా గుర్తు పట్టడానికి వాటిపై 3ఈ (ఎలక్ట్రానిక్ సిటీ), 3సీ (చందాపుర), 3ఏ (అత్తిబెలె) అని పెద్దగా రాసి ఉంటాయి.
నగర ప్రాంతాల్లో సంచరించే ఈ బస్సుల ద్వారా గ్రామీణులు సైతం తమ గమ్య స్థానాలను చేరుకోవచ్చు. దీని కోసం ఆయా గ్రామాలకు మరో 40 ఫీడర్ బస్సులను నడపనున్నారు. ఈ బస్సు సర్వీసులు ప్రతి 20 నిమిషాలకొకటి చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. కనీస సంఖ్యలో బస్సులను మారడం ద్వారా సులభంగా గమ్య స్థానాలను చేరుకోవడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ వైపు ప్రయాణికులను ఆకర్షించడమే ఈ ప్రాజెక్టు ప్రధానోద్దేశమని బీఎంటీసీ వర్గాలు తెలిపాయి. ఈ బస్సు సర్వీసులు ఉదయం 3.45 గంటల నుంచి రాత్రి 11.45 వరకు నడుస్తాయని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు.
4,684 కొత్త బస్సులు
విధాన సౌధ ముంగిట సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడంతో పాటు రాష్ర్టంలోని వివిధ నగరాలు, పట్టణాల మధ్య కనెక్టివిటీని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,919 కోట్ల వ్యయంతో 4,684 కొత్త బస్సుల కొనుగోలు, ప్రాథమిక వసతుల కల్పనకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు.
ఇందులో జెనర్మ్ కింద బెంగళూరు నగరానికి 2,500 బస్సులను ఇవ్వాలని కోరామని తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలుకు రూ.2,063 కోట్లు, వర్క్‌షాపులు, బస్టాండ్లు, బస్సు డిపోల నిర్మాణానికి రూ.856 కోట్లు వ్యయం కాగలదని ఆయన అంచనా వేశారు. బెంగళూరు నగరంలో సుమారు 2,400 బస్సు రూట్లు ఉన్నాయని తెలిపారు. సియోల్ (500 రూట్లు), లండన్ (700 రూట్లు), షాంఘై (1000 రూట్లు)తో పోల్చుకుంటే ఇదెంతో ఎక్కువని ఆయన చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, బీఎంటీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బీఎంటీసీ బస్సులో సీసీ కెమెరాలు
ప్రజల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్న బీఎంటీసీ అధికారుల అందులో మొదటి అడుగు వేశారు. బీఎంటీసీ బస్సుల్లో సీసీ కెమరాలు అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిగ్‌ట్రంక్ బస్సుల్లో మొదటి వీటిని అమర్చి అందులోని లోపాలను సవరించి మిగిలిన వాటన్నింటిలో ప్రవేశపెడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించిన బస్సులో మాత్రమే సీసీ కెమరా ఏర్పాటు చేయడం మిగిలిన ఏ ఒక్క బస్సులో కూడా సీసీ కెమెరా లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కనీసం 10 వాహనాల్లోనైనా ఈ ఏర్పాటు చేస్తే లోపాల అధ్యయనం శాస్త్రీయంగా సాగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
మెజిస్టిక్ టు ఎలక్ట్రానిక్ సిటీ ‘బిగ్ ట్రంక్’ బస్సులు
Published Tue, Sep 17 2013 3:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement
Advertisement