బొమ్మనహళ్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్న నేపథ్యంలో రెడ్డి సముదాయానికి చెందిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ఏర్పాటులో ప్రాధాన్యత కల్పించాలని రెడ్డి సముదాయ గురువు శ్రీ వేమనానంద స్వామీజీ అన్నారు. మంగళవారం నగరంలోని కోరమంగలలో ఉన్న మహా యోగి వేమన విద్యా సంస్థల ఆవరణంలో కర్ణాటక రెడ్డి సముదాయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ... బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలో సుమారు 12 మందికిపైగా రెడ్డి సముదాయానికి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు ఎన్నికయ్యారని, వారికి ప్రభుత్వ ఏర్పాటులో ప్రాధాన్యత ఇవ్వాలని స్వామీజీ అన్నారు.
గతంలో మాజీ సీఎం యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్డి సముదాయానికి చెందిన ముగ్గురికి మంత్రి పదవి ఇచ్చారని, బసవరాజ బొమ్మై హయాంలో రెడ్లకు అవకాశం కల్పించలేని, ప్రస్తుతం కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడు, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో రెడ్డి జనసంఘం అధ్యక్షుడు జయరామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటశివారెడ్డి, కార్యదర్శి సదాశివరెడ్డి, కృష్ణారెడ్డి, కోశాధికారి చంద్రారెడ్డితో పాటు పలువురు రెడ్డి సముదాయం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment