సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ఎదిగి నిరాడంబరుడిగా, ఆదర్శవాదిగా ప్రజా మన్ననలు పొందిననేత దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రామలింగారెడ్డి మరణం దుబ్బాక నియోజకవర్గ ప్రజలనే కాక, రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. రామలింగారెడ్డి మృతిపై సోమవారం శాసనసభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని ఊహించలేదు. బాధాతప్త హృదయంతో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నా. రామలింగారెడ్డి మృతిపట్ల ఈ సభ సంతాపం తెలుపుతోంది. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నేత రామలింగారెడ్డి నిత్యం ప్రజల మధ్యనే మనుగడ సాగించిన నిరాడంబరనేతగా చెరగని ముద్ర వేశారు’అని పేర్కొన్నారు.
విద్యార్థి దశ నుంచే ప్రజాఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారని, మెదక్ జిల్లాలో జరిగిన ఉద్యమాలకు బాసటగా నిలిచారని కొనియాడా రు. జర్నలిస్టుగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఎమ్మెల్యే కాక ముందు నుంచే తనకు ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసిన ముఖ్యమంత్రి, తాను నమ్మిన ఆదర్శాలను ఆచరణలో పెట్టిన అభ్యుదయవాదని కొనియాడారు. వరకట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారని, ప్రజాకవి కాళోజీ, తన చేతుల మీదుగా ఆదర్శ వివాహం జరిగిందని గుర్తు చేశారు. ఇదే ఆదర్శంతో తన పిల్లలకు కూడా వివాహాలు జరిపించారన్నారు. రామలింగారెడ్డిలోని నిబద్ధత, విశ్వసనీయత, నాయకత్వ లక్షణాలు గమనించి.. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున టికెట్ ఇచ్చామని, ఆ ఎన్నికల్లో దొమ్మాట నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున గెలిచి యువ నేతగా శాసనసభలో అడుగుపెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైనపాత్ర పోషించారని, సమైక్యవాదుల ప్రలోభాలకు లొంగకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని కొనియాడారు.
గుండెలు బరువెక్కాయి...
రామలింగారెడ్డి మరణం ఊహించనిదని, ఆయన మరణంపై తీర్మానాన్ని బలపరచాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని మంత్రులు పేర్కొన్నారు. నిరాడంబరంగా ఉండే మిత్రున్ని కోల్పోయామన్నారు. సీఎం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకులు అరుదని కేటీఆర్ కొనియాడారు. ఆయన మరణంతో తమ గుండెలన్నీ బరువెక్కాయని మంత్రులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment