సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అక్రమ మైనింగ్‌లో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రాథమిక వసతుల కల్పన, సమాచార శాఖ మంత్రి సంతోష్ లాడ్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆయనకు చెందిన వీఎస్ లాడ్ అండ్ సన్స్ కంపెనీ ఎలాంటి పర్మిట్లు లేకుండా సుమారు పది వేల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని సరఫరా చేసినట్లు గత లోకాయుక్త సంతోష్ హెగ్డే నివేదిక ప్రస్తావించిందని తెలిపింది. కనుక ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిందేనని మాజీ ముఖ్యమంత్రి డీవీ. సదానంద గౌడ డిమాండ్ చేశారు.
గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్‌కు బీజేపీ ప్రతినిధి బృందం శుక్రవారం దీనిపై మెమొరాండం సమర్పించింది. అనంతరం రాజ్ భవన్ వెలుపల సదానంద గౌడ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్‌పై లోకాయుక్త సమర్పించిన నివేదికలో ఉన్న తమ పార్టీ నాయకుల అందరి వద్ద రాజీనామాలు చేయించామని గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వం నిస్సిగ్గుగా నిందితులను రక్షిస్తోందని ఆరోపించారు. కాగా అక్రమ మైనింగ్‌లో భాగస్వామ్యం ఉన్న వారందరినీ ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల సీబీఐకి ఆదేశాలిచ్చిందని తెలిపారు.
వీఎస్ లాడ్ అండ్ సన్స్ కంపెనీని 2006 ఫిబ్రవరి 23న పునర్నిర్మించగా, ఆ ఏడాదే లాడ్ భాగస్వామిగా చేరారని వివరించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను గవర్నర్‌కు అందజేశామని తెలిపారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార సంఘం వీఎస్ లాడ్ అండ్ సన్స్‌ను సీ కేటగిరీ లీజుదారుగా వర్గీకరించిందని తెలిపారు. మైనింగ్‌లో భారీ అక్రమాలకు పాల్పడిన కంపెనీలన్నిటినీ ఈ కేటగిరీలో చేర్చారని వెల్లడించారు. పైగా తమ కంపెనీ స్థాయిని సీ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్‌కు పెంచాలన్న ఆ సంస్థ అ భ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చిందని తెలిపారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డాక్యుమెంట్లు సరైనవి కావంటూ లాడ్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏ హోదాలో ఆ డాక్యుమెంట్ల సాధికారతను ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిని బట్టి కళంకిత మంత్రిని ప్రభుత్వం వెనకేసుకొస్తోందని ఇట్టే అర్థమై పోతున్నదని ఆయన విమర్శించారు. గవర్నర్‌ను కలుసుకున్న వారిలో సదానంద గౌడతో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ మంత్రులు సురేశ్ కుమార్, కేఎస్. ఈశ్వరప్ప, గోవింద కారజోళ, ఆర్. అశోక్ ప్రభృతులున్నారు.
సంతోష్ లాడ్‌ను బర్తరఫ్ చేయాల్సిందే
Published Sat, Sep 21 2013 4:49 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement