సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను, తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయత్నిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టులో కొన్ని ముఖ్యమైన పత్రాలు మాయం కావడం సంచలనంగా మారింది. జూలై 14, 2017 నాటి తీర్పుకు వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఈ ఉదంతం వెలుగు చూసింది. దీంతో ఈ కేసు విచారణను న్యాయమూర్తులు లలిత్, అశోక్ భూషణ్ ఆగస్టు 20 కి వాయిదా వేశారు. (ఆఖరి అస్త్రం : మాల్యా బంపర్ ఆఫర్ )
తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపులో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆయనపై లోగడ కోర్టు ధిక్కార కేసు నమోదైంది. తనను దోషిగా పేర్కొంటూ.. 2017 లో కోర్టు తీర్పును రివ్యూ చేయవలసిందిగా మాల్యా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు లలిత్, అశోక్ భూషణ్ లతో కూడిన బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈ విచారణ సందర్భంగా కీలక పత్రాలు మాయం కావడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
గత మూడేళ్లుగా మాల్యా రివ్యూ పిటిషన్‌ని సంబంధిత కోర్టులో ఎందుకు లిస్ట్ చేయలేదో వివరించాల్సిందిగా రిజిస్ట్రీని జస్టిస్ లలిత్, భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ మూడు సంవత్సరాల్లో ఈ రివ్యూ పిటిషన్ కి సంబంధించిన ఫైల్‌ను ఏయే అధికారులు డీల్ చేశారో వారి పేర్లతో సహా అన్ని వివరాలను సమర్పించాలని వారు సూచించారు. కాగా ప్రభుత్వ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా.. తన పిల్లల పేరిట 40 మిలియన్ డాలర్లను బదలాయించారని, ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment