మేము కాదు!
- జయలలితకు శిక్ష ప్రకటనపై కర్ణాటకకు సంబంధం లేదన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
- పరప్పన అగ్రహార ఎదుట జయలలిత మద్దతుదారుల నిరసన
- తమిళనాడుకు కేఎస్‌ఆర్‌టీసీ బస్సు సర్వీసుల నిలిపివేత
సాక్షి, బెంగళూరు : అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు శిక్ష పడటానికి కర్ణాటక ఏమాత్రం కారణం కాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటకలో కేసు విచారణ జరిగినందువల్లే జయలలితకు శిక్ష పడిందంటూ తమిళనాడులో కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య ఈ విధంగా సమాధానమిచ్చారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని, ఇందులో ఎవరి ప్రమేయం ఉండబోదని అన్నారు.
అసత్య వదంతులను నమ్మి శాంతికి భంగం కలిగించే ప్రయత్నాలు చేయడం ఎవరికీ మంచిది కాదని సూచించారు. రాష్ట్ర యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఆదివారమిక్కడి విధానసౌధ ఎదుట నిర్వహించిన యువచేతన బైక్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానంలో జరిగిన విచారణలో జయలలిత దోషి అని తేలిందని, ఇందులో కర్ణాటక ప్రమేయం ఎంతమాత్రం లేదని అన్నారు. అనవసరంగా కర్ణాటకనుగానీ, ఇక్కడి ప్రభుత్వాన్ని గానీ ఈ విషయానికి సంబంధించి బాధ్యులను చేస్తూ అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టడం సమంజసం కాదని హితవు పలికారు.
పరప్పన ఎదుట ఆందోళన....
ఇక పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న తమ నాయకురాలు జయలలితను కలిసేందుకు ఆదివారం తమిళనాడు రాష్ట్ర మంత్రులతో పాటు వందల సంఖ్యలో మద్దతుదారులు, అన్నా డీఎంకే కార్యకర్తలు వచ్చారు. అయితే వీరిని జైలులోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించడంతో అక్కడ కాసేపు వాతావరణం ఉద్రిక్తంగా మారింది. తమ ‘అమ్మ’ లేకుండా తమిళనాడు రాష్ట్రం అనాధ అయిపోయిందంటూ పరప్పన అగ్రహార వద్దకు చేరుకున్న మహిళలు గుండెలు బాదుకుంటూ రోదించారు. దీంతో పరప్పన అగ్రహార జైలు వద్దకు చేరుకున్న సీనియర్ పోలీసు అధికారులు జయలలిత మద్దతుదారులందరినీ అక్కడినుండి పంపివేసి భద్రతా చర్యలను పర్యవేక్షించారు.
కేఎస్‌ఆర్‌టీసీ బస్‌ల నిలిపివేత....
ఇక అన్నాడీఎంకే అధినేత్రికి జైలు శిక్ష పడిన నేపథ్యంలో కర్ణాటక నుంచి తమిళనాడుకు వెళ్లే అన్ని బస్ సర్వీసులను కేఎస్‌ఆర్‌టీసీ నిలిపివేసింది. జయలలితకు శిక్షను ఖరారుచేస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించిన నేపథ్యంలో తమిళనాడులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కేఎస్‌ఆర్‌టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేఎస్‌ఆర్‌టీసీ బస్‌లకు ఏదైనా హాని కలగవచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేఎస్‌ఆర్‌టీసీ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల తరువాత బస్ సర్వీసులను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.