బీజేపీ క్రుట
- రాష్ట్రపతి ప్రణబ్‌కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిర్యాదు
- రాష్ర్ట ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు వ్యూహారచన చేశారని ఆరోపణ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నదన్న భరోసాతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిర్యాదు చేశారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ఆయన రాష్ర్టపతిని కలుసుకున్నారు.
అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ వ్యవహారాన్ని ముందు పెట్టుకుని తనను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ అనుమతిని కోరే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఎలాగైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా వారంతా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్‌కు సూచించాలని విన్నవించారు.
కాగా అధికార యంత్రాంగంలో పూర్తిగా ఈ-గవర్నెన్స్‌ను అమలు చేయడం ద్వారా కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతూ, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రావాలని సీఎం రాష్ట్రపతిని ఆహ్వానించారు. ‘మీకు అనుకూలమైన రోజేదో చెబితే, అదే రోజు ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేస్తాం’ అని విన్నవించారు.