ముఖ్యమంత్రి పదవిని చేపట్టి రేపటితో (మంగళవారం) 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సిద్ధరామయ్యకు ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడిగా మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినా కూడా పార్టీ....
సాక్షి, బెంగళూరు :ముఖ్యమంత్రి పదవిని చేపట్టి రేపటితో (మంగళవారం) 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సిద్ధరామయ్యకు ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడిగా మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినా కూడా పార్టీ పరంగా అత్తెసరు మార్కులు మాత్రమే దక్కించుకున్నాడనే వివ ుర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే సమన్వయ కమిటీ ఏర్పాటుతో పాటు సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్థి అయిన పరమేశ్వర్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వడానికి కాంగ్రెస్ పెద్దలు అంగీకరించినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది.
ఇందుకు కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన అనేక పథకాలు కూడా ఒక కారణం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన సిద్ధరామయ్య మే13న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే మ్యానిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైన వాటిని అమల్లోకి తీసుకువచ్చారు. ఇందులో రూ.1 కిలో బియ్యం, క్షీరభాగ్య తదితర పథకాలు ముఖ్యమైనవి. ఇక జులై నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఎటువంటి పన్నుల మోత లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అటు ఆర్థిక నిపుణులతో పాటు మెజారిటీ ప్రజల మన్ననలను పొందారు.
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న కర్ణాటక యాత్రికులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక హెలికాప్టర్‌లను వినియోగించి బాధితులకు సత్వర సాయం అందించడంలో సఫలీకృతమయ్యింది సిద్ధు ప్రభుత్వం. అయితే పరిపాలన విషయంలో కొన్ని విమర్శలు రాకపోలేదు. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో ఒక వర్గానికి అన్యాయం జరిగిందని విపక్షాలతో పాటు స్వపక్షంలోని నాయకుల నుంచే ఆయన వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఇక అక్రమగనుల తవ్వకాలకు వ్యతిరేకంగా పాదయాత్ర జరిపిన సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చిన తర్వాత అదే గనుల తవ్వకాలకు సంబంధించి అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.
ఈ క్రమంలో నిజాయితీ గల అధికారులను బదిలీలు చేశారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అయితే పార్టీ పరంగా మాత్రం సిద్ధరామయ్య బొటాబొటి మార్కులతో పాస్ అయ్యారనేది రాజకీయ విశ్లేషకుల భావన. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే హడావుడిగా రూ.1 కిలో బియ్యం పథకం, పాడి రైతులకు ప్రోత్సాహక ధనాన్ని రూ.2 నుంచి రూ.4కు పెంచడం వ ంటి దాదాపు రూ.4,500 కోట్ల ఖర్చు కాగల సంక్షేమ పథకాలను సిద్ధరామయ్య ప్రకటించారు. అప్పటికి ఇంకా మంత్రి మండలి కూడా పూర్తిగా ఏర్పడ లేదు. అటు పై ‘క్షీరభాగ్య’ వంటి పథకాల ప్రకటన విషయంలో కూడా పార్టీ సీనియర్ నాయకులను సంప్రదించలేదనే కారణంతో స్వపక్షంలోని చాలా మంది నేతలు సిద్ధరామయ్యపై అసహనాన్ని వ్యక్తం చేశారనే వార్తలూ వినిపించాయి.
జనాకర్షక పథకాలను ప్రకటించి ఆ క్రెడిట్ అంతా పార్టీకి కాకుండా వ్యక్తిగత ఖాతాలో వేసుకోవాలనేది సిద్ధరామయ్య ఆలోచననే విమర్శలు వినిపించాయి. దీంతో సిద్ధు దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం గురించి పార్టీ సీనియర్ నాయకులు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖలు రాశారు. దీంతో హైకమాండ్ కూడా ప్రభుత్వానికి, పార్టీకి మధ్య అనుసంధానం కోసమంటూ ‘సమన్వయ సమితి’ని ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ కమిటీలో సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తోపాటు సీనియర్ నాయకులు కూడా ఉంటారు. ఈ కమిటీ అనుమతి లేకుండా ప్రభుత్వం ఎటువంటి పథకాలను కాని, పాలనా పరమైన ప్రకటనలు కాని చేసే వీలుండదని తెలుస్తోంది.
ఇక కేపీసీసీ అధ్యక్షుడికి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి మంత్రి మండలిలో చేర్చాలనే హైకమాండ్ ఆలోచన వెనుక సిద్ధును కట్టడి చేయాలనే వ్యూహమే కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల భావన. పాలన లో పారదర్శకత కోసమంటూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొంతమందికి మంత్రి పదవులు దక్కకుండా చేశారని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకుకులు సిద్ధుపై గుర్రుగా ఉన్నారు. ఇందులో కనకపుర ఎమ్మెల్యే డీ.కే శివకువ ూర్ ముందు వరుసలో ఉన్నారు. ఇలా పాలనా పరంగా కాస్త మంచి మార్కులే కొట్టేసిన సిద్ధరామయ్య, పార్టీ పరంగా కూడా విజయం సాధించాల్సి ఉంది.