న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. శనివారం(జనవరి25) కేంద్రమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ ‘బీజేపీ మేనిఫెస్టోలో బూటకపు వాగ్దానాలు లేవు. ఢిల్లీలో చేపట్టాల్సిన పనుల జాబితా మాత్రమే ఉంది. ఢిల్లీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది.
కలుషితమైన యుమునా నదిని శుభ్రం చేయించలేదు. ప్రజలకు సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేదు. దేశ రాజధానిని కాలుష్య రహితంగా మార్చలేదు. గత ప్రభుత్వంలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో అవినీతి మరింతగా పెరిగిపోయింది. ఢిల్లీలో రోడ్ల నిర్మాణానికి రూ. 41 వేల కోట్లు, రైల్వే లైన్ల కోసం రూ. 15 వేల కోట్లు, ఎయిర్‌పోర్టుకు రూ. 21 వేల కోట్లను కేంద్రం అందించింది.
పేదల సంక్షేమ పథకాలను నిలిపివేయం. చేసిన వాగ్దానాలను కచ్చితంగా మా పార్టీ అమలు చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో యుమునా నదిని పూర్తిగా శుభ్రం చేయిస్తాం. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుంది. 1,700 అనధికార కాలనీలలో కొనుగోలు, అమ్మకంతో పాటు నిర్మాణం, యజమానులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం.
రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తాం’ అని అమిత్‌షా హామీ ఇచ్చారు. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకు రూ.2500 నగదు, సబ్సిడీపై రూ.500కే గ్యాస్ సిలిండర్లు లాంటి కీలక హామీలిచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ మధ్యే ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment