తెలుగు టెలివిజ‌న్ ఆర్టిస్ట్ అసోషియేష‌న్ ఎన్నికలు.. జీఎస్ హ‌రి ప్యానెల్ మేనిఫెస్టో విడుదల | Artists Association Of Telugu Television GS Hari Panel Released Manifesto At Film Chamber, Check Manifesto Points Inside | Sakshi
Sakshi News home page

GS Hari Panel Manifesto: టీవీ క‌ళాకారుల సంక్షేమ‌మే 'జీఎస్ హ‌రి ప్యానెల్' ధ్యేయం.. మేనిఫెస్టో విడుదల

Published Wed, Jan 29 2025 9:33 PM | Last Updated on Thu, Jan 30 2025 3:27 PM

Artists Association of Telugu Television GS Hari Panel Manifesto

తెలుగు టెలివిజ‌న్ ఆర్టిస్టు అసోషియేష‌న్ (Artists Association of Telugu Television) కార్య‌వ‌ర్గం ఎన్నికల సందర్భంగా జీఎస్ హ‌రి ప్యానెల్ స‌భ్యులు మేనిఫెస్టో విడుద‌ల చేశారు.  ఫిలిం చాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు.  తాము గెలిస్తే తెలుగు టెలివిజ‌న్ ఆర్టిస్టుల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు అమ‌లు చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా హామీలు ఇచ్చారు. కాగా.. ఈనెల 31న ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ టీవీ న‌టుడు విజ‌య్ యాద‌వ్ మాట్లాడుతూ.. 'టెలివిజ‌న్ క‌ళాకారుల సంక్షేమ‌మే ధ్యేయంగా వినోద్ బాల ఆధ్వర్యంలో 27 ఏళ్ల క్రితం మా తెలుగు టెలిజ‌విన్ ఆర్టిస్టు అసోషియేష‌న్ అసోసియేషన్‌ను ప్రారంభించాం. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో కార్య‌క్ర‌మ‌లు చేశామ‌ని ఘ‌నంగా చెప్ప‌గ‌లుగుతున్నాం. మా అసోసియేషన్‌కు మాత్రమే సొంత బిల్డింగ్ ఉంది. వంద‌లాది మంది ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించాం. తెలుగు ఆర్టిస్టుల‌కు మాత్ర‌మే అవ‌కాశాలు ఇవ్వాల‌నేదే మా ప్ర‌య‌త్నం. సీరియ‌ల్ షూటింగ్ టైమింగ్ విషయాలపై మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. కరోనా సమయంలో చిరంజీవి ట్రస్ట్, అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ల సహకారంతో ఆర్టిస్టులంద‌రికి సహాయం చేశాం. పేద కళాకారులకు పెన్షన్ ఇచ్చాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కార్య‌క్రమాలు చేస్తున్నాం. స‌మ‌ర్థులైన జీఎస్ హ‌రి ప్యానెల్ స‌భ్యులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే టెలివిజ‌న్ క‌ళాకారుల స‌మస్య‌లు తీర్చుతూ, సంక్షేమంపై దృష్టిపెడ‌తాం.' అని అన్నారు.

జీఎస్ హ‌రి ప్యానెల్ నుంచి అధ్య‌క్ష అభ్య‌ర్థి జీఎస్ హ‌రి మాట్లాడుతూ.. 'నటుడుగా ఒక ద‌శ‌లో నా జీవితం అయిపోయిందనుకున్న సమయంలో నన్ను ఆదుకుని నా నట జీవితాన్ని నిలబెట్టింది టీవీ రంగం. కరోనా సమయంలో పెద్ద‌లు చిరంజీవి , త‌ల‌సాని శ్రీనివాస్ స‌హ‌కారంతో ఇంటింటికి నిత్యావసర వస్తువులు అందించే బాధ్య‌త తీసుకున్న‌ది మ‌న అసోషియేష‌న్‌. నిరంత‌రం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌ని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను.  విజయ్ యాదవ్, వినోద్ బాల ఆధ్వ‌ర్యంలో నా మీద నమ్మకంతో నాకు అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. నాకు అన్నం పెట్టిన ఈ పరిశ్రమ సంక్షేమం కోసం నేను నిరంత‌రం ప్రయత్రిస్తానని ఈ సంద‌ర్బంగా హామీ ఇస్తున్నా.' అని అన్నారు. కాగా.. ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) అభ్యర్థి గుత్తికొండ భార్గవ త‌మ జీఎస్ హ‌రి ప్యానెల్ నుంచి మేనిఫెస్టో విడుద‌ల చేశారు. తమ ప్యానెల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల‌ని ఆయన కోరారు.

ఈ  స‌మావేశంలో జీఎస్ హ‌రి ప్యానెల్ నుంచి అధ్య‌క్ష అభ్య‌ర్థి జీఎస్ హ‌రి, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అభ్య‌ర్థి భార్గ‌వ గొట్టికొండ‌, ట్రీజ‌ర‌ర్ అభ్య‌ర్థి చెన్నుపాటి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్య‌ర్థి రాంజ‌గ‌న్, వైస్ ప్రెసిడెంట్ అభ్య‌ర్థులు జీఎస్ శ‌శాంక్, కృష్ణ కిషోర్, ఉమాదేవి, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ అభ్య‌ర్థులు బ్యాంక్ శ్రీనివాస్, దీప్తి వాజ్‌పేయి, జాయింట్ సెక్ర‌ట‌రీ అభ్య‌ర్థులు మేక రామ‌కృష్ణ‌, వికాస్, దీప దుర్గంపూడి, మ‌హిళ ఈసీ మెంబ‌ర్స్ అభ్య‌ర్థులు రాగ మాధురి, లిరిష‌, మ‌హ‌తి రిజ్వాన‌, ల‌క్ష్మిశ్రీ, ఈసీ మెంబ‌ర్స్ అభ్య‌ర్థులు బాలాజీ, శివ‌కుమార్ క‌ముని, విజ‌య్ రెడ్డి, ద్వార‌కేష్, ముర‌ళికృష్ణ రెడ్డి, గోపిక‌ర్, ముర‌ళికృష్ణ, టీవీ న‌టీన‌టులు తదితరులు పాల్గొన్నారు.

జీఎస్ హ‌రి ప్యానెల్ మేనిఫెస్టో హామీలు ఇవే :

1. ఒక్కో తెలుగు సీరియ‌ల్‌లో ఒక్క ప‌ర భాష ఆర్టిస్ట్ కి మాత్ర‌మే అనుమ‌తి
2. వీక్లీ షూటింగ్ డేట్స్ బ్లాకింగ్ ప‌ద్ద‌తిని నిర్మాత‌లు, ఛానెల్స్‌తో మాట్లాడి రద్దు చేస్తాం
3.అర్హులైన పేద క‌ళాకారుల‌కు పెన్ష‌న్‌లు
4. మెడిక్లైమ్ పాల‌సీ 3 ల‌క్ష‌ల నుంచి 5 ల‌క్ష‌ల‌కు పెంపు
5. నాగ‌బాబు స‌హ‌కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ న‌గ‌ర్ కృషి
6. మహిళ స‌భ్యుల‌కు ప్ర‌త్యేక ర‌క్ష‌ణ క‌ల్పిస్తాం.
7. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వ అవార్డులు మ‌న తెలుగు టీవీ క‌ళాకారుల‌కు అమ‌లు
8. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ద్వారా మ‌న స‌భ్యులై ఉండి అక్క‌డ నివాసం ఉంటున్న వారికి  తెల్ల రేష‌న్ కార్డుల కోసం ప్ర‌య‌త్నం
9. టాలెంట్ సెర్చ్ నిర్వ‌హించి ఛాన‌ల్స్ వారికి, కొత్త తెలుగు క‌ళాకారుల‌కు మ‌ధ్య వార‌ధిలా వ్య‌వ‌హ‌రిస్తాం.
10. ఈఎస్ఐ స్కీం వ‌ర్తింప చేస్తాం
11 ప్రావిడెంట్ ఫండ్ స్కీం అమ‌లు చేస్తాం
12. ప్ర‌తి మెంబ‌ర్‌కి వ‌ర్క్ క‌ల్పిస్తాం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement