బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : జనవరి 10 నుంచి మూడు రోజుల పాటు హంపి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పీటీ. పరమేశ్వర నాయక్ తెలిపారు. ఆయన శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి హంపి ఉత్సవాల ముందస్తు సమావేశం జరిపిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనవరి 10న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి మండ్య లోక్‌సభ సభ్యురాలు రమ్య, పర్యాటక శాఖా మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండేలను ఆహ్వానించినట్లు చెప్పారు. రెండవ రోజు జరిగే కార్యక్రమానికి ప్రతిపక్ష నేత హెచ్‌డీ కుమారస్వామి, గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ మంత్రి హెచ్‌కే. పాటిల్‌లను ఆహ్వానిస్తున్నామన్నారు. 12న ముగింపు కార్యక్రమానికి కేంద్ర రైల్వే శాఖా మంత్రి మల్లికార్జునఖర్గే, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, రాష్ట్ర వసతి శాఖా మంత్రి అంబరీష్‌ను ఆహ్వానించాలని తీర్మానించినట్లు తెలిపారు.
ఈసారి ఉత్సవాల్లో రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నామని, ఒక వేదికకు శ్రీకృష్ణదేవరాయల వేదికగా, మరొక దానినిమాజీ ఉప ముఖ్యమంత్రి ఎంపీ ప్రకాష్ వేదికగా ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు. జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ కళాకారులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లా, రాష్ట్ర కళాకారులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు రూ.6 కోట్లు ఖర్చు చేయాలని అంచనా ఉన్నట్లు చెప్పారు. ఇందుకోసం సార్వజనిక, పలు పరిశ్రమల యజమానుల సహకారం తీసుకుంటామన్నారు.
కన్నడ సంస్కృతీ శాఖ నుంచి రూ.కోటి, పర్యాటక శాఖ నుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయా మంత్రులు ప్రకటించారని, వీటిని మరింత పెంచాలని కోరుతున్నామన్నారు. శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని తలపించేలా పారదర్శకంగా ఉత్సవాలను జరుపుతున్నట్లు తెలిపారు. ఉత్సవాలు జరిగే నాటికల్లా హెచ్చెల్సీ కాలువపై కూలిన బ్రిడ్జ్‌ను నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
డిసెంబర్ నెలలో కాలువ నీరు నిలిపి వేస్తున్నందున డిసెంబర్ చివరి నాటికి పనులు ముగించాలని జిల్లాధికారిని ఆదేశించామన్నారు. అదే విధంగా హంపికి వెళ్లే రోడ్డు మరమ్మతులు సైతం చురుగ్గా సాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే భీమానాయక్, జెడ్పీ అధ్యక్షురాలు బెండిగేరి శోభ, జిల్లాధికారి ఏఏ.బిస్వాస్, ఎస్పీ చేతన్ సింగ్ రాథోర్, జెడ్పీ సీఎస్ మంజునాథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
జనవరి 10 నుంచి హంపి ఉత్సవాలు
Published Sat, Nov 2 2013 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement