Hampi festival
-
రూ.6.5 కోట్లతో హంపి ఉత్సవాలు
9న ఉత్సవాలను ప్రారంభించనున్న సీఎం సిద్ధరామయ్య వివిధ రాష్ట్రాల నుంచి కళాకారుల రాక బళ్లారి : హంపి ఉత్సవాలను రూ.6.5 కోట్లతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సమీర్‌శుక్లా తెలిపారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కన్నడ సాంస్కృతిక, పర్యాటక శాఖల నుంచి నిధులు విడుదల అవుతున్నట్లు తెలిపారు. వచ్చే నెల జనవరి 9న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హంపి ఉత్సవాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు పరమేశ్వరనాయక్, దేశ్‌పాండే, ఉమాశ్రీ, రోషన్బేగ్తో పాటు కేంద్ర మంత్రులు కూడా ఉత్సవాల్లో పాల్గొంటారని వివరించారు. ఉత్సవాల సందర్భంగా శ్రీకృష్ణదేవ రాయ, ఎంపీ ప్రకాష్, విద్యారణ్య, దరోజీ ఈరమ్మ, హక్కబుక్క వేదికలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వీటిల్లో రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. విజయ నగర సామ్రాజ్య వైభవాన్ని ఉట్టి పడేలా సౌండ్ అండ్ లైట్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు నృత్య పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాల నుంచి 60 మంది కళాకారులను పిలిపించనున్నామని తెలిపారు. గ్రామీణ క్రీడలకు అధిక ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. హంపి ఉత్సవాల్లో గాలి పటాల ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నామని, ఆహార మేళాతో పాటు వివిధ రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హంపి ఉత్సవాలు చివరి రోజు పెద్ద ఎత్తున బాణసంచా పేలుడు కార్యక్రమాన్ని వినూత్న తరహాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు హైదరాబాద్‌కు చెందిన నిపుణులను రప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లాధికారి వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. -
జనకంటక బళ్లారి కలెక్టర్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బళ్లారి జిల్లా కలెక్టర్ ప్రజా కంటకుడిగా తయారయ్యారని, ప్రజాప్రతినిధులు సహా ఎవరికీ గౌరవం ఇవ్వకుండా సర్వాధికారిలా వ్యవహరిస్తున్నారని బీఎస్‌ఆర్‌సీపీ నాయకుడు శ్రీరాములు ఆరోపించారు. శాసన సభలో శుక్రవారం ఆయన బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. తమ మాటేమో కానీ సామాన్య జనానికి సైతం ఆయన లేని పోని ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు. ‘ఈ పాపాత్ముడు తొలిగితే చాలు’ అన్నంతగా ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. ఆయన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా విసిగి పోయారని తెలిపారు. హంపి ఉత్సవాల సందర్భంగా చిన్న అంగళ్లు కూడా రుసుం చెల్లించాలని ఆదేశించారని ఆరోపించారు. మైనింగ్ వల్ల పర్యావరణానికి ఏర్పడిన హానిని సరిచేయడానికి సేకరించిన రూ.1,800 కోట్లను ఖర్చు చేయలేదని తెలిపారు. ఏదైనా పని మీద ఎమ్మెల్యేలు వెళితే కనీసం రెండు గంటలు వేచి ఉండేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ వెంటనే ఆ కలెక్టర్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యుడు బసవరాజ రాయరెడ్డి ఆయనకు అడ్డు తగులుతూ సుప్రీం కోర్టు నియమించిన సీఈసీ పర్యవేక్షణ ఉన్నందున, బళ్లారి కలెక్టర్‌ను ఉన్న ఫళంగా బదిలీ చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఆయన మాటలకు కాంగ్రెస్‌కే చెందిన ఎంపీ. రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అటువంటి కట్టుబాట్లు ఏమీ లేవని, అనవసర విషయాలను ప్రస్తావించ వద్దని చురకలు అంటించారు. అనంతరం శ్రీరాములు చర్చను కొనసాగిస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని ఆర్భాటంగా ప్రకటించారని గుర్తు చేశారు. ప్రస్తుతం బడ్జెట్లో కేటాయింపులు చూస్తుంటే, ఆ ప్రాజెక్టులు పూర్తి కావడానికి కనీసం 50 సంవత్సరాలు పడుతుందని దెప్పి పొడిచారు. తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకు పోయినందున కాలువల చివరన ఉన్న ఆయకట్టుకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూడిక తొలగించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పేదలకు తక్కువ ధరకు ఔషధాలను అందించడానికి ఉద్దేశించిన జనరిక్ దుకాణాల్లో మందులు లభ్యం కావడం లేదని ఆరోపించారు. బడ్జెట్లో కొత్త తాలూకాలను ప్రకటించాల్సి ఉండగా, ఆ ఊసే లేదని నిష్టూరమాడారు. -
రాయల వైభవానికి ప్రతీక హంపి ఉత్సవాలు
కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే త్వరలో బెంగళూరు-హొస్పేట మధ్య ఇంటర్సిటీ రైలు ముగిసిన హంపి ఉత్సవాలు గుబాళించిన సాంస్కృతిక సౌరభం భారీగా తరలివచ్చిన సందర్శకులు ఆకట్టుకున్న గ్రామీణ క్రీడలు మన సంస్కృతి, ప్రాచీన కళలను మరిచిపోకుండా.. శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా.. మూడు రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించిన హంపి ఉత్సవాలు ఆదివారం రాత్రి ముగిసాయి. శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని తలపించే విధంగా ఉత్సవాలను నిర్వహించడంతో దేశవిదేశాల నుంచి వేలాది మంది జనం తరలివచ్చారు. అంతరించిపోతున్న జానపద కళలు, కుస్తీ పోటీలు, సాహస క్రీడలు, రాతిగుండు ఎత్తే పోటీలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. మొత్తం మీద హంపి ఉత్సవాలు మూడు రోజుల పాటు పండుగ వాతావరణాన్ని తలపించాయి. చివరిరోజు కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. హొస్పేట, బళ్లారి, న్యూస్‌ైలైన్ : శ్రీకృష్ణదేవ రాయల గత వైభవాన్ని తలపించేలా హంపి ఉత్సవాలు అంగరంగ వైభవ ంగా ముగిసాయి. వ ుూడో రోజు ఆదివారం ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం హై-క ప్రాంతాల అభివృద్ధికి ఆర్టికల్-371 (జే)ను అమలు చేయడం ద్వారా బళ్లారి జిల్లా విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధి రంగాలు మరింత వృద్ధి చెందుతుందన్నారు. హంపి విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయుల పాలన చిరకాలంగా గుర్తుండేందుకు హంపి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. రాయల కాలం స్వర్ణయుగ కాలంగా గుర్తింపు పొందడం యావత్ ప్రపంచానికి గర్వకారణమన్నారు. హంపిలో జరుగుతున్న ముగింపు ఉత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం చూస్తే తాను ఇంతవరకు మైసూరు ఉత్సవాలు, మడికేరి తదితర ఉత్సవాల్లో కూడా చూడలేదని ఖర్గే అన్నారు. బెంగళూరు-హొస్పేట మధ్య ఇంటర్సిటీ రైలు ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఉందని, ఇక రెండు మూడు నెలల్లో బెంగళూరు ఇంటర్సిటీ రైలు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతామన్నారు. అదే విధంగా హరిహర-కొట్టూరు వ ూర్గంలో కూడా నూతన రైలు సర్వీసును మార్చిలోపు ప్రారంభిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం హై-క ప్రాంతాభివృద్ధికి ఆర్టికల్-371(జే) అమలు చేయడంతో 6 జిల్లాలలో ఈ ఆర్టికల్ అమలులోకి రావడంతో ఆయా జిల్లాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు. కన్నడ ప్రసిద్ధ సినీ నటుడు, రాష్ట్ర వసతి శాఖా మంత్రి అంబరీష్ మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్య గత వైభవం మరలా గుర్తు చేసేలా హంపి ఉత్సవాలు జరపడం అభినందనీయమన్నారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన వివిధ కళాకారుల కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర్‌నాయక్, రాష్ట్ర సమాచార మౌలిక సదుపాయాల మంత్రి రోషన్‌బేగ్, ఎమ్మెల్యేలు తుకారాం, నాగరాజ్, మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ, కాంగ్రెస్ నేతలు అల్లం వీరభద్రప్ప, అబ్దుల్ వహాబ్, జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు శోభా బెండిగేరి, ఉపాధ్యక్షురాలు మమత సురేష్, జిల్లాధికారి ఏఏ.బిస్వాస్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఉత్సవాలు హంపిలో గత మూడు రోజులుగా నిర్వహించిన ఉత్సవాలు ఆదివారంతో ముగిసాయి. శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని తలపించేలా హంపి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపారు. ముగింపు ఉత్సవాల సందర్భంగా హంపిలో గ్రామీణ కళలకు అద్దం పట్టే విధంగా వివిధ రకాల జానపద కళాప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, గ్రూప్ డాన్స్‌లు శ్రీకృష్ణదేవరాయ వేదిక వద్ద హోరెత్తించాయి. అదే విధంగా ఈ ఉత్సవాల్లో గ్రామీణ క్రీడలు, సాహస క్రీడలు, కుస్తీపోటీలు, కబడ్డీ తదితర పోటీలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు దేశ, విదేశాలకు చెందిన సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల మొదటి రోజు ప్రజలు పలుచగా కనబడినా మిగిలిన రెండు రోజులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో హంపి వీధులు కిటకిటలాడాయి. సీఎం సిద్ధరామయ్య, కేంద్ర మంత్రి, పలువురు రాష్ట్ర మంత్రులు ఉత్సవాలకు హాజరై ఇలాంటి ఉత్సవలు ఏటా నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. అదే విధంగా పర్యాటకులు హంపి అందాలను చూస్తూ తన్మయత్వం పొందారు. ఇదిలా ఉంటే సందర్శకులకు భోజనం, నీరు తదితర సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. హంపిలోని పురాతన కట్టడాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలతో కొత్త శోభ సంతరించుకుంది. మూడు రోజులుగాఎటు చూసినా జనసందోహమే కనిపించింది. శ్రీకృష్ణదేవరాయ వేదికతోపాటు ఎంపీ ప్రకాష్ వేదిక, హక్కబుక్కరాయ వేదిక, విద్యారణ్య వేదికల వద్ద వుూడు రోజుల పాటు వివిధ సాంస్కృతిక, జానపద, సినీ, నృత్య, హాస్య ఇలా చెప్పుకుంటూ పోతే మన సంస్కృతి వారసత్వాలకు అద్దం పట్టేలా శ్రీకృష్ణదేవరాయల పాలన గత వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఈసారి హంపి బైస్కై (హెలికాప్టర్లో హంపి అందాలు వీక్షించడం) కార్యక్రమంలో ఒక్కొక్కరి నుంచి రూ.2 వేలు టికెట్టు వసూలు చేస్తూ హంపి చుట్టూ హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టించారు. దాదాపు 800 మందికిపైగా హెలికాప్టర్ ఎక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. హంపి ఉత్సవాల సందర్భంగా దేశ విదేశాల నుంచి వివిధ రకాల సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పర్యాటకులు కదలకుండా కూర్చొనే విధంగా డ్యాన్స్‌లు, పాటలు, మ్యూజిక్ కార్యక్రమాలతో ఉత్సవాలకు ముగింపు పలికారు. -
హంపి ఉత్సవం జనోత్సవం
ప్రారంభ సభలో సీఎం సిద్ధరామయ్య నేతలు, అధికారుల ఉత్సవం కారాదు హంపి పేరు వింటేనే మనస్సు పులకరిస్తుంది ఈ ఉత్సవాలు మన సంస్కృతి, వారసత్వాలకు నిలువుటద్దం వీటిని నిర్వహించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది చరిత్ర పుటల్లో హంపికి చిరస్థానం సాక్షి, బళ్లారి : హంపి పేరు వింటేనే ప్రతి ఒక్కరి మనస్సు, శరీరం పులకించి పోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. హంపి ఉత్సవం రాజకీయ నేతలు, అధికారులు ఉత్సవం కాకూడదని, ప్రజలందరి ఉత్సవమని గుర్తు చేశారు. మూడు రోజుల పాటు హంపి ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి రావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి హంపిలోని శ్రీకృష్ణదేవరాయ వేదిక భువనేశ్వరి మాత విగ్రహానికి పూలమాల సమర్పించిన అనంతరం హంపి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. రెండు సంవత్సరాల నుంచి కరువు ప్రభావం వల్ల హంపి ఉత్సవాలను వాయిదా వేస్తూ వచ్చారని, ఈ ఏడాది కూడా రాష్ట్రంలో కరువు ఛాయలు ఉన్నప్పటికీ మన సంృ్కతిని, కళలను కాపాడాలనే ఉద్దేశంతో ఉత్సవాలను వాయిదా వేయకూడదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం హంపి ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు రాజధానిగా చేసుకుని పరిపాలించిన హంపి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచి పోయిందని గుర్తు చేశారు. భూమండలంలోనే విజయనగర సామ్రాజ్యం కంటే గొప్పది ఎక్కడా లేదని పర్షియా దేశ రాయబారి అబ్దుల్ రజాక్ పొగడ్తలతో ముంచెత్తారంటే హంపి విజయనగర సామ్రాజ్య గత వైభవం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గత వైభవం గుర్తు ఉండేలా ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విజయనగర సామ్రాజ్యం సువర్ణ యుగంగా పేరు పొందిందంటే అప్పట్లో బంగారు వజ్ర వైఢూర్యాలు రాసులు పోసుకుని అమ్ముకునేవారని గుర్తు చేశారు. హంపిలోని ప్రతి రాయిని పిలిస్తే పలికే మాదిరిగా శిల్పులు అతి అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. ప్రజల స్థితిగతులు, జీవన విధానాలు, పరిపాలన, శిలా శాసనాల ద్వారా అవగతమవుతుందన్నారు. దేశ, విదేశాల నుంచి కళాకారులకు కూడా అవకాశం కల్పించామని గుర్తు చేశారు. దసరా ఉత్సవాల తరహా మాదిరిగా హంపి ఉత్సవాలను ఎందుకు నిర్వహించ కూడదని అప్పట్లో తన సహచరుడు ఎంపీ ప్రకాష్ గుర్తు చేయడంతో హంపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు అయిందన్నారు. కార్యక్రమంలో హంపి విద్యారణ్య స్వామీజీ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పరమేశ్వర్ నాయక్, పర్యాటక శాఖ మంత్రి దేశ్‌పాండే, రాష్ట్ర కన్నడ సంృ్కతి శాఖ మంత్రి ఉమాశ్రీ, ఎమ్మెల్యేలు అనిల్‌లాడ్, భీమానాయక్, నాగరాజు, తుకారాం, ఎమ్మెల్సీ రాఘవేంద్ర హిట్నాల్, వృుత్యుంజయ జినగా, మాజీ మంత్రి అల్లం వీరభద్రప్ప, జిందాల్ ఎండీ వినోద్ నావెల్, శోభా బెండిగెరె, ఉపాధ్యక్షురాలు మమత సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
హంపి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
హొస్పేట, న్యూస్‌లైన్ : హంపిలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని బళ్లారి జిల్లా ఇన్చార్జ్, కార్మిక శాఖ మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్ అన్నారు. మంగళవారం ఆయన హంపిలో జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. హంపి ఉత్సవాల్లో బళ్లారి జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, తాలూకా పంచాయతీల ప్రజా ప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే ఉత్సవాల వేదిక పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లా కళాకారులకు మొదట ప్రాధాన్యత కల్పించామన్నారు. 10న ప్రధాన వేదిక అయిన శ్రీకృష్ణదేవరాయ వేదికపై ఉత్సవాలు ప్రారంభవమవుతాయన్నారు. ఉత్సవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభిస్తార ని తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ, కన్నడ సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. ఉత్సవాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తోరణగల్లు-కురేకుప్ప సమీపంలో హెచ్ఎల్సీపై రోడ్డు వంతెన మరమ్మతులను ఈ ఉత్సవాల లోపు ముగించాలని నిర్ణయించామని, కానీ కాలువలో నీరు ప్రవహిస్తుండడంవల్ల ఈ ఉత్సవం లోపు వంతెన పనులు పూర్తి చేయలేకపోతున్నామన్నారు. కాలువకు నీటిని బంద్ చేసిన అనంతరం వంతెన పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో ఎంతో మంది కళాకారులు తమ ప్రతిభను చాటనున్నారన్నారు. సుమారు రూ.7.30 కోట్ల ఖర్చుతో ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నామన్నారు. నాలుగు వేదికల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో జిల్లాధికారి ఏఏ.బిస్వాస్, జిల్లా ఎస్పీ చేతన్‌సింగ్ రాథోర్, హొస్పేట నగర అసిస్టెంట్ కమిషనర్ సునీల్‌కుమార్, తహ శీల్దార్ రమేష్ కోనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హంపి ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
హొస్పేట,న్యూస్‌లైన్ : ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న హంపి ఉత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని జిల్లాధికారి ఆదిత్య ఆమ్లాన్ బి స్వాస్ తెలిపారు. శనివారం ఆయన జి ల్లాలో హంపి ఉత్సవ ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం విలేకరులతో మా ట్లాడారు.దాదాపు రూ.7కోట్ల వ్య యం తో హంపి ఉత్సవాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలకు నాలుగు వేదికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన వేదికగా శ్రీకృష్ణదేవరాయ వేదిక, ఎంపీ ప్రకాష్‌వేదిక, విద్యారణ్యవేదిక, అక్కాబుక్కా వేదికల్లో మూడు రోజులు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈసారి ఉత్సవాల్లో హంపి బై స్కై (ఆకాశం)కు ప్రయాణం చేసేందుకు (హెలికాప్టర్ ద్వారా) హంపి, సండూరు, టీబీడ్యాంను వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హంపి బైస్కై వీక్షించేందుకు మూడు హెలికాప్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్దలకు రూ.2 వేల, 10 సంవత్సరాలు లోపు ఉన్న చిన్నారులకు రూ.1500 లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. హంపి ఉత్సవాలకు వచ్చే వీవీఐపీలు, రాజకీయనేతలకు, కళాకారులకు వసతి సౌకర్యం కల్పించామన్నారు .హంపి ఉత్సవాలు వీక్షించే పర్యాటకులకు రాత్రి పూటభోజన వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండు చోట్లు భోజన వసతి ఉంటుందన్నారు. భోజనాలకు రూ.5లు వసూలు చేస్తున్నామన్నారు. జిల్లా నుంచి రాష్ట్రం, ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం వస్తుండటంతో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.10వ తేది సాయంత్రం శ్రీ కృష్ణదేవరాయ వేదికలో హంపి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉత్సవాలను ’ప్రారంభిస్తారని తెలిపారు. అదే విధంగా ముఖ్య అతిథులుగా పర్యాటక శాఖమంత్రి దేశ్‌పాండే, ఇతర మంత్రులు, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా వస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ముగ్గులు పోటీలతో పాటు, గ్రామీణ క్రీడలు ఉంటాయన్నారు. ఈ సారి ముఖ్యంగా వికలాంగులకు కూడా క్రీడాపోటీలు నిర్వహిస్తామన్నారు. హంపిలో నాలుగు ప్రధాన వేదికలకు, స్మారకాలకు విద్యుత్‌దీపాలంకరణ చేస్తామన్నారు. ఉత్సవాలకు వీక్షించేందుకు వచ్చే వారికి అదనంగా బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చేతన్ సింగ్ రాథోడ్, హొస్పేట అసిస్టెంట్‌కమిషనర్ సునిల్‌కుమార్ పాల్గొన్నారు. -
19న హంపి ఉత్సవాలపై సమావేశం
హొస్పేట, న్యూస్‌లైన్ : జనవరి 10, 11, 12 తేదీలలో హంపి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్ల గురించి ఈ నెల 19న బెంగళూరులో సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్య, పర్యాటక శాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే తెలిపారు. ఆయన సోమవారం స్థానిక అమరావతి అతిథి మందిరంలో హంపి ఉత్సవాల గురించి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. హంపి ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా భావించి సుమారు రూ.5 కోట్లతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పర్యాటక శాఖ నుంచి కోటి రూపాయలు, కన్నడ సంస్కృతిక శాఖ నుంచి రూ.కోటి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇంకా అదనంగా కన్నడ సంస్కృతిక శాఖ నుంచి రూ.25 లక్షల నిధుల మంజూరుకు అనుమతి కోరినట్లు తెలిపారు. మిగిలిన నిధులను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. హంపి ఉత్సవాలకు ముఖ్యంగా మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నామని, వాటికి ఎంపీ ప్రకాష్ వేదిక, ఆధునిక వేదిక, శ్రీ విద్యారణ్య వేదికలని పేరు పెట్టినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే హంపి ఉత్సవాల్లో స్థానిక కళాకారులకే కాకుండా ఇతర జిల్లాల కళాకారులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. మహిళలకు ముగ్గుల పోటీతోపాటు ఇతర పోటీలు కూడా ఉంటాయన్నారు. పురుషులకు దేహధారుఢ్య, షూటింగ్, చిత్రలేఖన, జల, సాహస క్రీడలు, కుస్తీ పోటీలతోపాటు తదితర గ్రామీణ క్రీడాపోటీలు ఉంటాయన్నారు. వికలాంగులకు కూడా ఈత పోటీలతోపాటు ఇతర పోటీలు ఉంటాయన్నారు. ఉత్సవాలను వీక్షించేందుకు బళ్లారి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి బస్సు సౌకర్యం కల్పించేందుకు త గిన చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఏమాత్రం ఉండదని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాల్లో హంపి బై స్కై ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పీటీ పరమేశ్వరనాయక్, రాష్ట్ర మహిళ సంక్షేమ శాఖ మంత్రి ఉమశ్రీ, బళ్లారి జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు శోభా బెండి గేరి, జిల్లాధికారి ఆదిత్య ఆమ్లాన్ బిస్వాస్, నగర అసిస్టెంట్ కమిషనర్ పీ.సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కట్టడ కార్మికుల పరిహారం పెంపు
= మంత్రి పరమేశ్వర్ నాయక్ = లక్షలాది మందికి లబ్ధి = కార్మికులు పేరు నమోదు చేయించుకోవాలి = అటువంటి వారికే పథకాలు వర్తింపు = కార్మికుల వద్దకే అధికారులు వెళ్లి పేర్ల నమోదుకు శ్రీకారం = బళ్లారి జిల్లాలో ప్రక్రియ ప్రారంభం = త్వరలో అన్ని జిల్లాలకూ విస్తరణ = హంపి ముగింపు ఉత్సవాలకు చిరంజీవి సాక్షి, బెంగళూరు : నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో అందిస్తున్న పరిహారం, ఆర్థిక సాయం మొత్తాన్ని పెంచనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పి.టి.పరమేశ్వర్‌నాయక్ వెల్లడించారు. దీని వల్ల రాష్ట్రంలోని ఈ రంగంపై ఆధారపడ్డ లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. బెంగళూరులోని విధానసౌధలో శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. నిర్మాణ రంగంలోని కార్మికులు కార్మిక శాఖ వద్ద తమ పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ నిదానంగా సాగుతోందన్నారు. దీంతో భవన నిర్మాణ ప్రాంతం వద్దకే అధికారులు వెళ్లి.. కార్మికుల పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ బళ్లారిలో ఇటీవలే ప్రారంభించామని, ఈ విధానాన్ని దశల వారీగా అన్ని జిల్లాలకూ విస్తరింపజేస్తామని అన్నారు. పేరు నమోదు చేసుకున్న వారికే సంక్షేమ ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు. గార్మెంట్స్ ఫ్యాక్టరీల్లోని కార్మికులకు ప్రస్తుతం రూ.4,700 కనీస వేతనంగా పొందుతున్నారని, దీన్ని కూడా పెంచే యోచనలో ఉన్నామని తెలిపారు. దీనితో పాటు కట్టడ కార్మికుల పరిహారం పెంపుపై ఈ నెల 12న స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా 100 ఐటీఐ కళాశాలలు, వంద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ప్రత్యేక భవనాలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని మంత్రి వెల్లడించారు. హంపి ముగింపు ఉత్సవాలకు కేంద్ర మంత్రి చిరంజీవి వచ్చే ఏడాది జనవరి 10 నుంచి మూడు రోజుల పాటు హంపి ఉత్సవాలు నిర్వహిస్తామని బళ్లారి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్న పరమేశ్వర్ నాయక్ తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. 12న జరిగే ముగింపు ఉత్సవాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలకు రూ.6 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. -
జనవరి 10 నుంచి హంపి ఉత్సవాలు
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : జనవరి 10 నుంచి మూడు రోజుల పాటు హంపి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పీటీ. పరమేశ్వర నాయక్ తెలిపారు. ఆయన శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి హంపి ఉత్సవాల ముందస్తు సమావేశం జరిపిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనవరి 10న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండ్య లోక్‌సభ సభ్యురాలు రమ్య, పర్యాటక శాఖా మంత్రి ఆర్వీ దేశ్‌పాండేలను ఆహ్వానించినట్లు చెప్పారు. రెండవ రోజు జరిగే కార్యక్రమానికి ప్రతిపక్ష నేత హెచ్డీ కుమారస్వామి, గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ మంత్రి హెచ్‌కే. పాటిల్‌లను ఆహ్వానిస్తున్నామన్నారు. 12న ముగింపు కార్యక్రమానికి కేంద్ర రైల్వే శాఖా మంత్రి మల్లికార్జునఖర్గే, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, రాష్ట్ర వసతి శాఖా మంత్రి అంబరీష్‌ను ఆహ్వానించాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈసారి ఉత్సవాల్లో రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నామని, ఒక వేదికకు శ్రీకృష్ణదేవరాయల వేదికగా, మరొక దానినిమాజీ ఉప ముఖ్యమంత్రి ఎంపీ ప్రకాష్ వేదికగా ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు. జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ కళాకారులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లా, రాష్ట్ర కళాకారులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు రూ.6 కోట్లు ఖర్చు చేయాలని అంచనా ఉన్నట్లు చెప్పారు. ఇందుకోసం సార్వజనిక, పలు పరిశ్రమల యజమానుల సహకారం తీసుకుంటామన్నారు. కన్నడ సంస్కృతీ శాఖ నుంచి రూ.కోటి, పర్యాటక శాఖ నుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయా మంత్రులు ప్రకటించారని, వీటిని మరింత పెంచాలని కోరుతున్నామన్నారు. శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని తలపించేలా పారదర్శకంగా ఉత్సవాలను జరుపుతున్నట్లు తెలిపారు. ఉత్సవాలు జరిగే నాటికల్లా హెచ్చెల్సీ కాలువపై కూలిన బ్రిడ్జ్‌ను నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ నెలలో కాలువ నీరు నిలిపి వేస్తున్నందున డిసెంబర్ చివరి నాటికి పనులు ముగించాలని జిల్లాధికారిని ఆదేశించామన్నారు. అదే విధంగా హంపికి వెళ్లే రోడ్డు మరమ్మతులు సైతం చురుగ్గా సాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే భీమానాయక్, జెడ్పీ అధ్యక్షురాలు బెండిగేరి శోభ, జిల్లాధికారి ఏఏ.బిస్వాస్, ఎస్పీ చేతన్ సింగ్ రాథోర్, జెడ్పీ సీఎస్ మంజునాథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.