జనకంటక బళ్లారి కలెక్టర్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బళ్లారి జిల్లా కలెక్టర్ ప్రజా కంటకుడిగా తయారయ్యారని, ప్రజాప్రతినిధులు సహా ఎవరికీ గౌరవం ఇవ్వకుండా సర్వాధికారిలా వ్యవహరిస్తున్నారని బీఎస్‌ఆర్‌సీపీ నాయకుడు శ్రీరాములు ఆరోపించారు. శాసన సభలో శుక్రవారం ఆయన బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. తమ మాటేమో కానీ సామాన్య జనానికి సైతం ఆయన లేని పోని ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు. ‘ఈ పాపాత్ముడు తొలిగితే చాలు’ అన్నంతగా ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. ఆయన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా విసిగి పోయారని తెలిపారు.
హంపి ఉత్సవాల సందర్భంగా చిన్న అంగళ్లు కూడా రుసుం చెల్లించాలని ఆదేశించారని ఆరోపించారు. మైనింగ్ వల్ల పర్యావరణానికి ఏర్పడిన హానిని సరిచేయడానికి సేకరించిన రూ.1,800 కోట్లను ఖర్చు చేయలేదని తెలిపారు. ఏదైనా పని మీద ఎమ్మెల్యేలు వెళితే కనీసం రెండు గంటలు వేచి ఉండేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ వెంటనే ఆ కలెక్టర్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సభ్యుడు బసవరాజ రాయరెడ్డి ఆయనకు అడ్డు తగులుతూ సుప్రీం కోర్టు నియమించిన సీఈసీ పర్యవేక్షణ ఉన్నందున, బళ్లారి కలెక్టర్‌ను ఉన్న ఫళంగా బదిలీ చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఆయన మాటలకు కాంగ్రెస్‌కే చెందిన ఎంపీ. రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అటువంటి కట్టుబాట్లు ఏమీ లేవని, అనవసర విషయాలను ప్రస్తావించ వద్దని చురకలు అంటించారు.
అనంతరం శ్రీరాములు చర్చను కొనసాగిస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని ఆర్భాటంగా ప్రకటించారని గుర్తు చేశారు. ప్రస్తుతం బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తుంటే, ఆ ప్రాజెక్టులు పూర్తి కావడానికి కనీసం 50 సంవత్సరాలు పడుతుందని దెప్పి పొడిచారు. తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకు పోయినందున కాలువల చివరన ఉన్న ఆయకట్టుకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూడిక తొలగించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పేదలకు తక్కువ ధరకు ఔషధాలను అందించడానికి ఉద్దేశించిన జనరిక్ దుకాణాల్లో మందులు లభ్యం కావడం లేదని ఆరోపించారు. బడ్జెట్‌లో కొత్త తాలూకాలను ప్రకటించాల్సి ఉండగా, ఆ ఊసే లేదని నిష్టూరమాడారు.