చెత్త పాలన!
- స్పీకర్ తిమ్మప్ప ఫైర్
- పాలనలో పారదర్శకతను ప్రశ్నించిన కాగోడు
- గత బీజేపీ ప్రభుత్వంతో పోలిక
- బడ్జెట్‌లో హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని మండిపాటు
- అధికారులతో పనిచేయించుకునే విధానం సీఎంకు తెలియదని ఎద్దేవా
సాక్షి, బెంగళూరు : అధికార కాంగ్రెస్ పార్టీ పాలన తీరును ఆ పార్టీ సీనియర్ నేత, శాసనసభ స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఎండగట్టారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గత బీజేపీ పాలనకు ప్రస్తుత సిద్ధరామయ్య ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని ఘాటుగా విమర్శించారు. మరో 24 గంటల్లో ఉప ఎన్నికల పోలింగ్ మొదలవుతున్న తరుణంలో ప్రభుత్వ పాలనలో పారదర్శకతను ప్రశ్నిస్తూ స్పీకర్ విమర్శలు చేయడం చర్చానీయాంశమైంది.
అధికారంలోకి వచ్చే ముందు, బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ విషయంలో అధికారులు చురుకుగా వ్యవహరించడం లేదని తప్పుబట్టారు.
అధికారులతో పనిచేయించుకునే విధానం సీఎం సిద్ధరామయ్యకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. దీంతో అభివృద్ధి కుంటు పడిందని ఆరోపించారు. పాలనలో పారదర్శకత లోపించిందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంపై గతంలో ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. దీనిపై లేఖ అందిందంటూ సీఎం పేషీ నుంచి సమాధానం వచ్చిందని, దానిపై ఎలాంటి స్పందన లేదని అన్నారు.
స్పీకర్ స్థానంలో ఉన్న తనకే ఇలాంటి సమాధానం ఇస్తే ఇక సామాన్య ప్రజల పట్ల ప్రభుత్వ స్పందన ఎంత దారుణంగా ఉంటుందో ఊహించవచ్చునని అన్నారు. ఎమ్మెల్యే రమేష్‌తో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘నేను ప్రజా నాయకుడనిఇ, ఏ స్థానంలో ఉన్నా ప్రజలకు సేవ చేయడం మాత్రమే తెలుసు’నని ఆయన వాఖ్యానించారు.