హొస్పేట, న్యూస్‌లైన్ : జనవరి 10, 11, 12 తేదీలలో హంపి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్ల గురించి ఈ నెల 19న బెంగళూరులో సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్య, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండే తెలిపారు. ఆయన సోమవారం స్థానిక అమరావతి అతిథి మందిరంలో హంపి ఉత్సవాల గురించి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. హంపి ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా భావించి సుమారు రూ.5 కోట్లతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే పర్యాటక శాఖ నుంచి కోటి రూపాయలు, కన్నడ సంస్కృతిక శాఖ నుంచి రూ.కోటి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇంకా అదనంగా కన్నడ సంస్కృతిక శాఖ నుంచి రూ.25 లక్షల నిధుల మంజూరుకు అనుమతి కోరినట్లు తెలిపారు. మిగిలిన నిధులను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. హంపి ఉత్సవాలకు ముఖ్యంగా మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నామని, వాటికి ఎంపీ ప్రకాష్ వేదిక, ఆధునిక వేదిక, శ్రీ విద్యారణ్య వేదికలని పేరు పెట్టినట్లు చెప్పారు.
మూడు రోజుల పాటు జరిగే హంపి ఉత్సవాల్లో స్థానిక కళాకారులకే కాకుండా ఇతర జిల్లాల కళాకారులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. మహిళలకు ముగ్గుల పోటీతోపాటు ఇతర పోటీలు కూడా ఉంటాయన్నారు. పురుషులకు దేహధారుఢ్య, షూటింగ్, చిత్రలేఖన, జల, సాహస క్రీడలు, కుస్తీ పోటీలతోపాటు తదితర గ్రామీణ క్రీడాపోటీలు ఉంటాయన్నారు. వికలాంగులకు కూడా ఈత పోటీలతోపాటు ఇతర పోటీలు ఉంటాయన్నారు. ఉత్సవాలను వీక్షించేందుకు బళ్లారి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి బస్సు సౌకర్యం కల్పించేందుకు త గిన చర్యలు చేపడతామన్నారు.
ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఏమాత్రం ఉండదని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాల్లో హంపి బై స్కై ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పీటీ పరమేశ్వరనాయక్, రాష్ట్ర మహిళ సంక్షేమ శాఖ మంత్రి ఉమశ్రీ, బళ్లారి జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు శోభా బెండి గేరి, జిల్లాధికారి ఆదిత్య ఆమ్లాన్ బిస్వాస్, నగర అసిస్టెంట్ కమిషనర్ పీ.సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
19న హంపి ఉత్సవాలపై సమావేశం
Published Tue, Dec 10 2013 3:34 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM
Advertisement
Advertisement