ప్రారంభ సభలో సీఎం సిద్ధరామయ్య
నేతలు, అధికారుల ఉత్సవం కారాదు
హంపి పేరు వింటేనే మనస్సు పులకరిస్తుంది
ఈ ఉత్సవాలు మన సంస్కృతి, వారసత్వాలకు నిలువుటద్దం
వీటిని నిర్వహించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది
చరిత్ర పుటల్లో హంపికి చిరస్థానం
సాక్షి, బళ్లారి : హంపి పేరు వింటేనే ప్రతి ఒక్కరి మనస్సు, శరీరం పులకించి పోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. హంపి ఉత్సవం రాజకీయ నేతలు, అధికారులు ఉత్సవం కాకూడదని, ప్రజలందరి ఉత్సవమని గుర్తు చేశారు. మూడు రోజుల పాటు హంపి ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి రావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి హంపిలోని శ్రీకృష్ణదేవరాయ వేదిక భువనేశ్వరి మాత విగ్రహానికి పూలమాల సమర్పించిన అనంతరం హంపి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు.
రెండు సంవత్సరాల నుంచి కరువు ప్రభావం వల్ల హంపి ఉత్సవాలను వాయిదా వేస్తూ వచ్చారని, ఈ ఏడాది కూడా రాష్ట్రంలో కరువు ఛాయలు ఉన్నప్పటికీ మన సంృ్కతిని, కళలను కాపాడాలనే ఉద్దేశంతో ఉత్సవాలను వాయిదా వేయకూడదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం హంపి ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు రాజధానిగా చేసుకుని పరిపాలించిన హంపి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచి పోయిందని గుర్తు చేశారు.
భూమండలంలోనే విజయనగర సామ్రాజ్యం కంటే గొప్పది ఎక్కడా లేదని పర్షియా దేశ రాయబారి అబ్దుల్ రజాక్ పొగడ్తలతో ముంచెత్తారంటే హంపి విజయనగర సామ్రాజ్య గత వైభవం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గత వైభవం గుర్తు ఉండేలా ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విజయనగర సామ్రాజ్యం సువర్ణ యుగంగా పేరు పొందిందంటే అప్పట్లో బంగారు వజ్ర వైఢూర్యాలు రాసులు పోసుకుని అమ్ముకునేవారని గుర్తు చేశారు. హంపిలోని ప్రతి రాయిని పిలిస్తే పలికే మాదిరిగా శిల్పులు అతి అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు.
ప్రజల స్థితిగతులు, జీవన విధానాలు, పరిపాలన, శిలా శాసనాల ద్వారా అవగతమవుతుందన్నారు. దేశ, విదేశాల నుంచి కళాకారులకు కూడా అవకాశం కల్పించామని గుర్తు చేశారు. దసరా ఉత్సవాల తరహా మాదిరిగా హంపి ఉత్సవాలను ఎందుకు నిర్వహించ కూడదని అప్పట్లో తన సహచరుడు ఎంపీ ప్రకాష్ గుర్తు చేయడంతో హంపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు అయిందన్నారు.
కార్యక్రమంలో హంపి విద్యారణ్య స్వామీజీ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పరమేశ్వర్ నాయక్, పర్యాటక శాఖ మంత్రి దేశ్‌పాండే, రాష్ట్ర కన్నడ సంృ్కతి శాఖ మంత్రి ఉమాశ్రీ, ఎమ్మెల్యేలు అనిల్‌లాడ్, భీమానాయక్, నాగరాజు, తుకారాం, ఎమ్మెల్సీ రాఘవేంద్ర హిట్నాల్, వృుత్యుంజయ జినగా, మాజీ మంత్రి అల్లం వీరభద్రప్ప, జిందాల్ ఎండీ వినోద్ నావెల్, శోభా బెండిగెరె, ఉపాధ్యక్షురాలు మమత సురేష్ తదితరులు పాల్గొన్నారు.
హంపి ఉత్సవం జనోత్సవం
Published Sat, Jan 11 2014 3:09 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement