హొస్పేట, న్యూస్‌లైన్ :
హంపిలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని బళ్లారి జిల్లా ఇన్‌చార్జ్, కార్మిక శాఖ మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్ అన్నారు. మంగళవారం ఆయన హంపిలో జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. హంపి ఉత్సవాల్లో బళ్లారి జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, తాలూకా పంచాయతీల ప్రజా ప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే ఉత్సవాల వేదిక పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లా కళాకారులకు మొదట ప్రాధాన్యత కల్పించామన్నారు. 10న ప్రధాన వేదిక అయిన శ్రీకృష్ణదేవరాయ వేదికపై ఉత్సవాలు ప్రారంభవమవుతాయన్నారు. ఉత్సవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభిస్తార ని తెలిపారు.
రాష్ట్ర పర్యాటక శాఖ, కన్నడ సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. ఉత్సవాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తోరణగల్లు-కురేకుప్ప సమీపంలో హెచ్‌ఎల్‌సీపై రోడ్డు వంతెన మరమ్మతులను ఈ ఉత్సవాల లోపు ముగించాలని నిర్ణయించామని, కానీ కాలువలో నీరు ప్రవహిస్తుండడంవల్ల ఈ ఉత్సవం లోపు వంతెన పనులు పూర్తి చేయలేకపోతున్నామన్నారు. కాలువకు నీటిని బంద్ చేసిన అనంతరం వంతెన పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో ఎంతో మంది కళాకారులు తమ ప్రతిభను చాటనున్నారన్నారు. సుమారు రూ.7.30 కోట్ల ఖర్చుతో ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నామన్నారు. నాలుగు వేదికల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో జిల్లాధికారి ఏఏ.బిస్వాస్, జిల్లా ఎస్పీ చేతన్‌సింగ్ రాథోర్, హొస్పేట నగర అసిస్టెంట్ కమిషనర్ సునీల్‌కుమార్, తహ శీల్దార్ రమేష్ కోనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హంపి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
Published Wed, Jan 8 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement