హోస్పేట్/కర్నూలు: కర్ణాటకలోని హోస్పేట్‌లో ఉన్న తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ఊడిపోవడంతో నీరు బయటికి పోటెత్తింది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో శనివారం(ఆగస్టు10) అర్ధరాత్రి డ్యామ్ గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ సమయంలో 19వ గేటు చైన్ తెగి గేటు మొత్తం కొట్టుకుపోయింది.
ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయాన్నే డ్యామ్‌ను కొప్పాల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి శివరాజ్ సందర్శించారు.
ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు బయటికి పోతోంది. డ్యామ్ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అప్రమత్తంగా ఉండండి.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ
తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
అవసరమైతే సహాయంకోసం టోల్ ఫ్రీ నంబర్లు 1070,112, 18004250101 సంప్రదించాలని సూచించింది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కాలువలు వాగులు దాటే ప్రయత్నం చేయరాదని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment