ఐదు భాగాలను బిగించిన ఇంజినీర్లు
తుంగభద్ర డ్యాం గేట్లు మూసివేత
సాక్షి, బళ్లారి/ హొసపేటె/హొళగుంద: తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ క్రస్ట్ గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు పూర్తయింది. శుక్రవారం రాత్రి ఈ గేటు తొలి భాగాన్ని బిగించిన సిబ్బంది.. శనివారం ఉదయం నుంచి సాయంత్రంలోగా మరో నాలుగు భాగాలను బిగించారు. దీంతో గేటు ఏర్పాటు విజయవంతంగా పూర్తయింది.
ఓపక్క 71 టీఎంసీల నీరు జలాశయంలో ఉన్నప్పటికీ.. ప్రత్యేక నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఇంజినీర్లు, సిబ్బంది సాహసోపేతంగా ఐదు భాగాలను బిగించారు. దీంతో డ్యాం గేట్లను మూసివేశారు. స్టాప్‌లాగ్ గేటు నుంచి మాత్రం కొద్దిపాటి నీరు లీకవుతోంది. దానిని కూడా ఆదివారానికి సరిచేస్తామని అధికారులు తెలిపారు. ఈ ఖరీఫ్ పంటలకు ఇబ్బంది లేదని తెలిపారు. ఈ నెల 9వ తేదీన కొట్టుకుపోయిన 19వ గేటు భాగాలు డ్యాంకు దిగువన కొంత దూరంలో శనివారం కనిపించాయి.
నీరు వృథా కాకుండా..
కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటులో ప్రభుత్వం, అధికారులు చూపిన చొరవ 35 టీఎంసీల జలాలు వృథాగా పోకుండా కాపాడగలిగారు. గేటు కొట్టుకుపోయిన వెంటనే డ్యాం అధికారులు రక్షణ చర్యల్లో భాగంగా 33 గేట్లలో 29 గేట్ల వరకు ఎత్తి దాదాపు లక్షా ఇరవై వేల క్యూసెక్కుల నీటిని వారం పాటు నదిలోకి వదిలాల్సి వచ్చింది. జలాశయంలో ముందుగా 65 టీఎంసీల నీరును ఖాళీ చేస్తే గేట్లు అమర్చవచ్చని అనుకున్నప్పటికీ, అధికారులు కేవలం 30 టీఎంసీలే నీరు నదిలోకి వదిలి గేట్లను పెట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గేట్ల నిపుణుడు 81 ఏళ్ల కన్నయ్యనాయుడు కృషితో 71 టీఎంసీల వద్ద గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో 35 టీఎంసీల నీటిని ఆదా చేయగలిగారు. గేటు కొట్టుకుపోవడంతో పంటలు నష్టపోతామని రైతులు ఆందోళన చెందారని, స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుతో వారంతా ఊపిరి పీల్చుకున్నారని ఏపీ తుంగభద్ర రైతు సంఘం నేత తప్పెట రామిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment