ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరి
కొత్త గేటు ఏర్పాటుచేయాలంటే నీటి మట్టాన్ని తగ్గించాలి
అంటే డ్యాం నుంచి 61 టీఎంసీలు వదలాల్సిందే.. నెలాఖరుకు కొత్త గేటు అమర్చే అవకాశం
వచ్చే మూడు, నాలుగు నెలల్లో తుంగభద్రకు కనిష్టంగానే వరద
దీంతో ఇక ఈ ఏడాది డ్యాం నిండే అవకాశాలు తక్కువే
రాయలసీమ, ఉత్తర కర్ణాటక, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో 17.33 లక్షల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం
పైగా.. ‘సీమ’లో వర్షాభావం.. తాగునీటికి ఇబ్బందులు తప్పవని సర్వత్రా ఆందోళన
సాక్షి, అమరావతి/హొళగుంద/సాక్షి, బళ్లారి/ఆలూరు: రాయలసీమ, ఉత్తర కర్ణాటక, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల వరదాయిని తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. డ్యాం 19వ గేటు లింక్ చానల్ శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో తెగి గేటు నదిలో కొట్టుకుపోవడంతో భారీఎత్తున నీరు నదిలోకి పోటెత్తింది. దీంతో డ్యాం రక్షణలో భాగంగా అధికారులు 33 గేట్లలో 29 గేట్లు ఎత్తి నీటిని నదిలోకి వదిలేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్తది ఏర్పాటుచేయాలంటే గేటు బిగించే స్థాయి (క్రెస్ట్ లెవల్)కి అంటే 1,613 అడుగులకు నీటిమట్టాన్ని తగ్గించాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
అంటే.. అప్పుడు 43.83 టీఎంసీల నీరు మాత్రమే ఉంటుంది. గేటు కొట్టుకుపోక ముందు డ్యాంలో 1,632.6 అడుగుల్లో 104.18 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే.. ఆ స్థాయికి నీటి మట్టాన్ని తగ్గించాలంటే 61 టీఎంసీలను దిగువకు వదిలేయాలి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుంటే రోజుకు 9 టీఎంసీల చొప్పున వారంపాటు నీటిని దిగువకు వదిలేస్తే.. డ్యాంలో నీటి మట్టం 1,613 అడుగుల స్థాయికి తగ్గుతుంది. ఆ తర్వాత కొత్త గేటు ఏర్పాటుకు కనీసం వారం రోజులు పడుతుందని తుంగభద్ర బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దాదాపు నెలాఖరుకుగానీ కొత్త గేటును అమర్చలేరన్నది స్పష్టమవుతోంది. ఈ ఘటనతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు కర్ణాటక మంత్రులు డ్యాంను పరిశీలించారు. తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం అక్కడే మకాం వేసింది. హైదరాబాద్, చెన్నై నుంచి ప్రత్యేక నిపుణులు రానున్నారు. నిజానికి.. 71 ఏళ్ల ‘తుంగభద్ర’ చరిత్రలో ఎన్నడూ గేట్లు కొట్టుకుపోయిన దాఖలాల్లేవు.
టీబీ బోర్డు నిర్లక్ష్యం..
టీబీ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా డ్యాం భద్రతను మరచి నీటిని నిల్వచేయడంతో నేడు ఎన్నడూలేనంత దారుణ పరిస్థితి జలాశయం ఎదుర్కొంటోంది. డ్యాంలో నీటి చేరిక మొదలుకాక ముందే గేట్లన్నీ పరిశీలించి ట్రయల్ రన్‌చేసి నీటినిల్వకు అన్ని విధాలా సిద్ధంచేయాల్సిన అధికారులు అలా చేయకపోవడంతో వారి నిర్లక్ష్యం నేడు రైతుల పాలిట శాపంగా మారింది. గతేడాది ఒకే పంటతో సరిపెట్టుకున్న రైతులు ఈ ఏడాది దానికన్నా అధ్వాన పరిస్థితిలోకి వెళ్లడంతో ఆందోళన చెందుతున్నారు.
రైతుల ఆశలు ఆవిరి..
ఇక సాధారణంగా తుంగభద్రలో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరులో వరదలు ఉండవు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే.. డ్యాంలో నీటి లభ్యత తగ్గుతుంది. దీంతో.. గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ నీటి లభ్యత అధికంగా ఉంటుందని ఆశించిన రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. నిజానికి.. ఈ జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేది తుంగభద్రే.
గడిచిన చాలా ఏళ్లుగా తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత తగ్గిపోగా ఈ ఏడాది ఆశాజనకంగా నీరు చేరింది. కానీ, తాజా పరిస్థితితో మిగిలిన నీటితో ఖరీఫ్‌లో ఒక పంటకు మాత్రమే బొటాబొటిగా నీళ్లు సరిపోతాయి. యుద్ధప్రాతిపదికన డ్యాం గేటును ఏర్పాటుచేసినా డ్యాం ఎగువ భాగంలో చినుకు జాడలేకపోతే సాగునీటి మాట దేవుడెరుగు.. తాగునీరు కోసం ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అందరూ కలవరపడుతున్నారు.
17.33 లక్షల ఎకరాలపై ప్రభావం
తుంగభద్ర డ్యాం ఆయకట్టు విస్తరించిన రాయలసీమ, ఉత్తర కర్ణాటక, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలు వర్షాభావ ప్రాంతాలు. రాయలసీమలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీల కింద 4.42 లక్షల ఎకరాలు, ఉత్తర కర్ణాటకలో 8.96 లక్షల ఎకరాల ఆయకట్టు నేరుగా డ్యాంపై ఆధారపడ్డాయి.
డ్యాం దిగువన రాయలసీమలో కేసీ కెనాల్ కింద 2.78 లక్షల ఎకరాల ఆయకట్టు.. ఉత్తర కర్ణాటకలో రాయబసవన ఛానల్స్ కింద 24,468 వేల ఎకరాలు.. ఉత్తర, కర్ణాటక, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కింద 92,900 ఎకరాల ఆయకట్టు వెరసి 3.95 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కేసీ కెనాల్, ఆర్డీఎస్, రాయబసవన ఛానల్స్ కూడా తుంగభద్ర డ్యాంలో నీటి కేటాయింపులు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఏడాది 17.33 లక్షల ఎకరాల ఆయకట్టుపై గేటు కొట్టుకుపోవడం తీవ్ర ప్రభావం చూపుతుంది.
మరోవైపు.. ఈ ఏడాది రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాలు సాగు, తాగునీటికి ప్రధానంగా ఆధారపడేది హెచ్చెల్సీ (ఎగువ కాలువ) పైనే. ఎల్లెల్సీ (దిగువ కాలువ)పై కర్నూలు, నంద్యాల జిల్లాలు ఆధారపడతాయి. హెచ్చెల్సీ, ఎల్లెల్సీలతోపాటు కేసీ కెనాల్‌కు నీటి లభ్యత తగ్గితే తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
త్వరలో గేటు పునరుద్ధరణ: డీకే
డ్యాం వద్ద కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ, గేటు కొట్టుకుపోవడం బాధాకరమని.. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో నీరు అందేలా చూస్తామని, అయితే మళ్లీ డ్యాంలోకి నీరు వచ్చేదాన్ని బట్టి రబీ పంటకు నీటివసతి కల్పిస్తామని చెప్పారు.
అధికారులను అప్రమత్తం చేశాం: నిమ్మల
తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కర్నూలు జిల్లాలో కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు సమీక్షించారన్నారు. వెంటనే గేటు అమర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరామన్నారు.
నిధులు ఇవ్వకపోవడంతో..: విరూపాక్షి
డ్యాం మరమ్మతులకు ఏపీ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోవడం, ఇంజినీర్ల వైఫల్యంతోనే గేట్ కొట్టుకుపోయిందని ఆలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆరోపించారు. ఆదివారం ఆయన డ్యాం గేట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గేట్ పనులను త్వరతగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పరిస్థితి దారుణం: అజ్జప్ప, కౌలు రైతు
వర్షాల్లేక పరిస్థితి దారుణంగా తయారైయింది. నేను నాలుగెకరాలను కౌలుకు తీసుకుని సాగుచేసుకుంటున్నాను. వేలాది రూపాయిలు పెట్టుబడి పెట్టాను. ఒకవైపు కర్ణాటక రైతులు ఎల్లెల్సీ ఎగువన పైపులు వేసి, గండికొట్టి సాగునీరందకుండా చేస్తుంటే ఇప్పుడు ఏకంగా డ్యాంకే గండి పడింది. ఇలాగైతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం.
Comments
Please login to add a commentAdd a comment