outflow water
-
కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. పోటెత్తిన నీరు
హోస్పేట్/కర్నూలు: కర్ణాటకలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ఊడిపోవడంతో నీరు బయటికి పోటెత్తింది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో శనివారం(ఆగస్టు10) అర్ధరాత్రి డ్యామ్ గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ సమయంలో 19వ గేటు చైన్ తెగి గేటు మొత్తం కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయాన్నే డ్యామ్‌ను కొప్పాల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి శివరాజ్ సందర్శించారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు బయటికి పోతోంది. డ్యామ్ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అప్రమత్తంగా ఉండండి.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. అవసరమైతే సహాయంకోసం టోల్ ఫ్రీ నంబర్లు 1070,112, 18004250101 సంప్రదించాలని సూచించింది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కాలువలు వాగులు దాటే ప్రయత్నం చేయరాదని కోరింది. -
ఆల్మట్టికి నిలిచిన వరద
జూరాల : కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు శనివారం ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 122.83 టీఎంసీల నీటినిల్వ ఉంది. పై నుంచి వచ్చే ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని కూడా నిలిపివేశారు. దీంతో ఆల్మట్టి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలు లేవు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.58 టీఎంసీల నీటినిల్వ ఉంది. పై నుంచి ఇన్‌ఫ్లో కేవలం 1598 క్యూసెక్కులు వస్తుండటంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం మినహా, విద్యుదుత్పత్తి, స్పిల్‌వేల ద్వారా దిగువకు ఔట్‌ఫ్లో పూర్తిగా నిలిపివేశారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు దిగువన మన రాష్ట్రంలో ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.05 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు 630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే భీమా ఎత్తిపోతల లిఫ్ట్–1 ద్వారా 1300 క్యూసెక్కులు, లిఫ్ట్–2 ద్వారా 750 క్యూసెక్కులు, జూరాల కుడి, ఎడమ కాలువల ద్వారా 750 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు ద్వారా 5180 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని విద్యుదుత్పత్తి, స్పిల్‌వే ద్వారా ఔట్‌ఫ్లోను పూర్తిగా నిలిపివేశారు.